సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్నేహితులు కలిస్తే చాయ్ తాగాల్సిందే. ఇంటికి వచ్చిన అతిథులకు టీ ఆఫర్ చేయాల్సిందే. అంతలా దైనందిన జీవితంలో తేనీరు మమేకమైంది. టీ విషయంలో వినియోగదార్ల అభిరుచుల్లో మార్పు వచ్చింది. యువతరం కొత్తదనం కోరుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న కంపెనీలు వినూత్న ప్రయోగాలతో విభిన్న రుచుల్లో టీ పొడులను తీసుకొస్తున్నాయి. మిల్క్ బబుల్ టీ, గ్రేప్ ఐస్ టీ, లెమన్ ఐస్ టీ, కశ్మీరీ కావా, గ్రీన్ మ్యాంగో.. ఇలా చెప్పుకుంటూపోతే వేలాది రుచులు కస్టమర్లను ఊరిస్తున్నాయి. వీటిని ఆఫర్ చేసేందుకు ఇప్పుడు భారత్‌లో ఔట్‌లెట్లూ విస్తరిస్తున్నాయి. టీ వినియోగంలో ప్రపంచంలో భారత్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్పత్తి పరంగా అంతర్జాతీయంగా రెండవ స్థానంలో, ఎగుమతుల్లో నాల్గవ స్థానంలో ఉంది. దేశీయ టీ పొడుల మార్కెట్ సుమారు రూ.20,000 కోట్లుంది.
ఇదీ భారత టీ మార్కెట్..
దేశంలో 2019లో 139 కోట్ల కిలోల టీ ఉత్పత్తి అయింది. అస్సాంలో వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో గతేడాది ఇది 125 కోట్ల కిలోలకు పరిమితమైంది. మొత్తం ఉత్పత్తిలో దేశీయంగా వినియోగం ఏకంగా 80 శాతముందంటే భారతీయులకు టీ పట్ల ఉన్న అభిరుచి ఇట్టే అర్థం అవుతోంది. ప్యాక్డ్ విభాగం విక్రయాల్లో 10-12 పెద్ద బ్రాండ్లదే 80 శాతం వాటా. 400 వరకు లోకల్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. టాటా చా, చాయ్ పాయింట్, ద టీ ప్లానెట్, చా బార్ వంటి 200 దాకా చైన్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేలాది టీ కేఫ్‌లతో విస్తరిస్తున్నాయి. విలువ చేకూర్చి వం దలాది విభిన్న టీ రుచులను తయారు చేస్తున్న కంపెనీలు రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తాయని ద టీ ప్లానెట్ ఫౌండర్ మాధురి గనదిన్ని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కన్సల్టెన్సీల రాకతో వ్యవస్థీకృతంగా ఫ్రాంచైజీ విధానంలో టీ కేఫ్‌ల ఏర్పాటు సులభతరం అయిందన్నారు.
90 శాతం గృహాల్లో..
భారత్‌లో సుమారు 90 శాతం గృహాల్లో టీని ఆస్వాదిస్తున్నారు. అల్పాహారం ముందుగానీ, అల్పాహారంతోగానీ 80 శాతం మంది టీ తీసుకుంటున్నారు. తూర్పు ప్రాంతం వారు ఎనీ టైం ఆస్వాదిస్తారట. పాలతో చేసిన చాయ్‌కి 80 శాతంపైగా గృహాల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవలి కాలంలో చక్కెర లేని గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ వంటివి పాపులర్ అవుతున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే కేఫ్‌లు, హోటళ్లు, క్యాంటీన్లలో టీ తాగే వారి సంఖ్య పశ్చిమ, దక్షిణాదిన ఎక్కువ. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాణిజ్య కార్యకలాపాలు ఇందుకు కారణమని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటోంది. ఇక టీ కేఫ్‌లలో వేడివేడి చాయ్‌తోపాటు చల్లని టీ రకాలూ ఉవ్విళ్లూరిస్తున్నాయి. పండ్లు, పూలు, క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, మొక్కలను జోడించి టీ పొడులను తయారు చేస్తున్నారు. కిలోకు రూ.20,000 వరకు ధర పలికే గోల్డెన్ టిప్స్ వంటి వెరైటీలూ ఉన్నాయి.
మహమ్మారిలోనూ ఎగుమతులు..
దేశం నుంచి గతేడాది రూ.5,159 కోట్ల విలువైన 20.7 కోట్ల కిలోల టీ పొడులు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది రూ.5,737 కోట్ల విలువైన 25.2 కోట్ల కిలోల టీ విదేశాలకు సరఫరా అయింది. సీఐఎస్ దేశాలు, ఇరాన్, యూఏఈ, యూఎస్‌ఏ, చైనా, యూకే ప్రధాన మార్కెట్లు. శ్రీలంక, నేపాల్, చైనా, కెన్యా నుంచి ఖరీదైన టీ రకాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. వియత్నాం, ఇండోనేసియా, అర్జెంటీనా నుంచి చవక రకాలను కొనుగోలు చేస్తున్నారు. 2019లో రూ.239 కోట్ల విలువైన 1.58 కోట్ల కిలోల టీ పొడులు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతయ్యాయి. గతేడాది ఏకంగా రూ.403 కోట్లతో 2.3 కోట్ల కిలోల పొడులు వచ్చి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment