న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ఐదేళ్లలో 200కు మించి ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదే కాలంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు 1,400 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ సర్కారు తొమ్మిదేళ్ల హయాంలో విమానయాన రంగం సాధించిన పురోగతిపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 వరకు 74 ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌పోర్ట్‌లే ఉండేవని, ఇవి రెట్టింపై ప్రస్తుతం 148కి చేరినట్టు చెప్పారు. ‘‘2013–14లో దేశీయంగా ఆరు కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పుడు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 14.5 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులు 50 శాతం పెరిగి 4.7 కోట్ల నుంచి 7 కోట్లకు చేరారు. దేశ, విదేశీ కార్గో పరిమాణం ఇదే కాలంలో 2.2 మిలియన్ టన్నుల నుంచి 3.6 మిలియన్ టన్నులకు (65 శాతం అధికం) పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రగతిశీల విధానాల ఫలితంగా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది’’అని మంత్రి వివరించారు.
విమానాల సంఖ్య కూడా 2014 నాటికి 400గా ఉంటే, ఇప్పుడు 700కు చేరినట్టు చెప్పారు. ‘‘ఎయిర్ ఇండియా 70 బిలియన్ డాలర్ల విలువైన 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది కేవలం ఆరంభమే. భారత విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో 1,200 నుంచి 1,400 విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నాయి. రానున్న ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ల రంగంలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి’’అని సింధియా పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ ప్రయాణికుల సంఖ్య 45 కోట్లకు (వార్షికంగా) చేరుకుంటుందన్నారు. హెలీకాప్టర్‌ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఉడాన్ ఫ్లయిట్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment