న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్‌చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్‌గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్‌తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది.
వివారాలు ఇవీ...
50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ.
లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి.
వరుసలో మరో 16 కంపెనీలు!
అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్‌లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి.
కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్‌కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్‌తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment