న్యూఢిల్లీ: హౌసింగ్ సొల్యూషన్స్, గాజు కిటికీలు తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం సెయింట్ గొబెయిన్ ఇండియా .. భారత్‌లో రూ. 8,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే అయిదేళ్లలో వివిధ విభాగాల్లో పెట్టుబడులు, కంపెనీల కొనుగోళ్ల కోసం ఈ నిధులను వెచ్చించనుంది. కంపెనీ చైర్మన్ బి. సంతానం ఈ విషయాలు వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గొబెయిన్ గ్లోబల్ వ్యాపారంలో అత్యంత లాభదాయక మార్కెట్లలో భారత్ మూడో స్థానంలో ఉందని ఆయన వివరించారు. ‘వృద్ధి, లాభదాయకత, విస్తరణ, డిజిటల్, నిపుణులు వంటి అంశాల్లో సెయింట్ గొబెయిన్ ఇండియా మెరుగ్గా రాణిస్తోంది.
నిర్మాణ రంగంలో కావచ్చు.. పారిశ్రామిక రంగంలో కావచ్చు మా వ్యాపారాలన్నీ బాగున్నాయి‘ అని సంతానం తెలిపారు. ప్రస్తుతం తాము మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. భారత్ నుంచి ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులు మందగించినా తమవి మాత్రం స్థిరంగా 15 శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్ గొబెయిన్ ఇటీవలే రాక్‌వూల్ ఇండియా, ట్విగా సంస్థలను కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment