కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది.
మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment