జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది.
బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది.
తమ వజ్రాల గని వద్దే ప్రమాదం
రియోజిమ్ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం.
ఒక్కరూ మిగల్లేదు..
జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది.
మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్‌వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు.
Comments
Please login to add a commentAdd a comment