రూమ్ వారీ ఆదాయంలో 5 శాతం వృద్ధి
సీక్వెన్షియల్‌గా చూస్తే కొంత డీలా
జూన్ క్వార్టర్‌పై జేఎల్‌ఎల్ నివేదిక
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్‌ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది.
కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్‌లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్‌లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్
హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్‌ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్‌ఎల్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment