ముంబై: ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 964 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 23,952 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు.
అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు గురువారం ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,153 పాయింట్లు పతనమై 79,029 వద్ద, నిఫ్టీ 322 పాయింట్లు పతనమై 23,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. రోజంతా భారీ నష్టాలతో ట్రేడయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్ల ఆధారిత బ్యాంకులు, రియల్టీ షేర్లతో పాటు ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.30%, 0.28 శాతం బలహీనపడ్డాయి.
ప్రపంచ మార్కెట్లపై ఫెడ్ ఎఫెక్ట్...
ఆశించినట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ.. వచ్చే ఏడాది నుంచి రేట్ల తగ్గింపులో దూకుడు ఉండదంటూ సంకేతాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో యూరప్ మార్కెట్లు ఒక శాతం పతనమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్రకటన రోజు (బుధవారం రాత్రి) 3% నష్టపోయిన అమెరికా మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో రికవరీ బాటపట్టాయి. యూఎస్ స్టాక్ సూచీలు నాస్‌డాక్ 1%, డోజోన్స్ అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో సన్‌ఫార్మా(1%), హెచ్‌యూఎల్ (0.11%), పవర్‌గ్రిడ్(0.09%) మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.50% – 2% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 1.20% అత్యధికంగా పడింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.25%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1% నష్టపోయాయి. రిలయన్స్ (–2%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2%), ఇన్ఫీ(1.50%), ఎల్‌అండ్‌టీ (1%)
నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి.
నాలుగు రోజుల్లో రూ.9.65 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915 పాయింట్ల (3.54%) పతనంతో రూ.9.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449.76 లక్షల కోట్ల (5.29 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment