6 నెలల్లోనే లక్ష కోట్ల డాలర్లు జమ
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!
ముంబై: బీఎస్‌ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్‌ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్‌ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.
ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో యూఎస్‌ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి.
జర్నీ తీరిలా
2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్‌ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్‌ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.
మార్కెట్ విలువ మదింపులో మార్పులు
లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
స్వల్ప నష్టాలతో సరి..
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.
ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్‌లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment