న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2021 జూలైలో మంచి పనితీరును కనబరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చి 47.91 శాతం పురోగతితో 35.17 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం (3.82 బిలియన్ డాలర్లు), ఇంజనీరింగ్ (2.82 బిలియన్ డాలర్లు), రత్నాలు–ఆభరణాల (1.95 బిలియన్ డాలర్లు) ఎగుమతుల్లో భారీ పెరుగుదల మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ఇక దిగుమతులు 59.38 శాతం పెరిగి 46.40 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 11.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
►ఆయిల్‌సీడ్స్, బియ్యం, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి.
►పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 97% పెరిగి 6.35 బిలియన్ డాలర్లకు చేరాయి.
►పసిది దిగుమతులు 135.5 శాతం పెరిగి 2.42 బిలియన్ డాలర్లకు చేరాయి.
►ముత్యాలు, ప్రీసియన్, సెమీ–ప్రీసియస్ రాళ్ల దిగుమతులు 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది.
సేవలు ఇలా..: భారత్ సేవల ఎగుమతులు జూన్ నెలలో 24.1% పెరిగి 19.72 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి. మేలో ఎగుమతుల విలువ 17.35 బిలియన్ డాలర్లుకాగా, ఏప్రిల్‌లో ఈ విలువ 17.54 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక సేవల దిగుమతులు 24.8% పెరిగి 11.14 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం రెండు నెలల్లో ఈ విలువ వరుసగా 9.89 బిలియన్ డాల ర్లు, 10.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment