న్యూఢిల్లీ: వరుసగా ఆరు నెలల పాటు క్షీణించిన ఎగుమతులు తాజాగా సెప్టెంబర్‌లో వృద్ధి నమోదు చేశాయి. గత నెలలో 5.27 శాతం పెరిగి 27.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశ ఎకానమీ కరోనా పరిణామాల నుంచి వేగంగా కోలుకుంటోందనడానికి ఇది సంకేతమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 26.02 బిలియన్ డాలర్లుగా ఉన్నా యి. కరోనా వైరస్ దెబ్బతో మార్చి నుంచి ఎగుమతులు తగ్గిన సంగతి తెలిసిందే.
తయారీ రంగంలోనూ వెలుగు రేఖ
భారత తయారీరంగం క్రియాశీలత క్రమంగా మెరుగుపడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌లో ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) వరుసగా రెండవ నెల వృద్ధి బాటన కొనసాగింది. సూచీ 56.8గా నమోదయ్యింది. 2012 జనవరి తర్వాత సూచీ ఈ స్థాయిని మళ్లీ చూడ్డం ఇదే కావడం గమనార్హం. అంటే ఎనిమిదేళ్ల గరిష్టాన్ని సూచీ తాజాగా చూసిందన్నమాట. ఆగస్టులో సూచీ 56.8 వద్ద ఉంది. సూచీ 50పైన ఉంటేనే వృద్ధి ధోరణిగా, ఆలోపు క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగింది.
అయితే కరోనా నేపథ్యంలో కఠిన లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువ క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరగడాన్ని సూచీ ప్రతిబింబిస్తున్నట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లీమా తెలిపారు. తాజా సూచీలో పలు రంగాలకు సంబంధించి సానుకూలతలు కనిపించినట్లు తెలిపారు. అమ్మకాలు, ఉత్పత్తి, కొత్త ఎగుమతులకు ఆర్డర్లు వచ్చినట్లు వివరించారు. వ్యాపార విశ్వాసం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment