న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3.2 శాతం పుంజుకుని రూ. 5,360 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,195 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 24 శాతం ఎగసి రూ. 34,470 కోట్లకు చేరింది.
కీలక మార్కెట్లలో ప్రధానమైన యూఎస్‌సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినప్పటికీ ఈ ఏడాది ఆదాయంలో 14–16 శాతం వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా(గైడెన్స్) వేయడం గమనార్హం. గతంలో 13–15 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ1లో పటిష్ట ఫలితాలు, డిమాండ్ ఔట్‌లుక్ నేపథ్యంలో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. త్రైమాసికవారీగా చూస్తే క్యూ1లో నికర లాభం 5.7 శాతం క్షీణించింది. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 5,686 కోట్లు ఆర్జించింది.
నిర్వహణా మార్జిన్లు వీక్
ప్రస్తుత సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ నిర్వహణా మార్జిన్లు 23.7 శాతం నుంచి 20.1 శాతానికి డీలాపడ్డాయి. గతేడాది క్యూ4లోనూ ఇవి 21.5 శాతంగా నమోదయ్యాయి. విక్రయాలు, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో నిర్వహణా వ్యయాలు 14.4 శాతం హెచ్చాయి. క్యూ1లో రూ. 6,914 కోట్ల నిర్వహణా లాభం ఆర్జించింది. ఈ కాలంలో 21,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించింది. కంపెనీ ఆదాయంలో యూఎస్ నుంచి 17.8 శాతం, యూరప్ నుంచి 21.9 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధించింది. భారీ డీల్స్‌తోకూడిన కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.7 బిలియన్ డాలర్లు(రూ. 13,600 కోట్లు)గా నమోదైంది. వేతన పెంపు, ఉద్యోగ నియామకాల ద్వారా నిపుణుల నియామకాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు.
ఇతర హైలైట్స్
► జూన్ చివరికల్లా ఇన్ఫోసిస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,35,186కు చేరింది. 2022 మార్చికల్లా ఈ 3,14,015 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
► గత 12 నెలల సగటు ప్రకారం ఉద్యోగ వలస 28.4 శాతానికి ఎగసింది. గతేడాది క్యూ4లో ఇది 27.7 శాతంకాగా.. గత క్యూ1లో 13.9 శాతమే.
► 106 క్లయింట్లను కొత్తగా జమ చేసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,778ను తాకింది.
► 10 కోట్ల డాలర్ల క్లయింట్లు 38కాగా, 5 కోట్ల డాలర్ల క్లయింట్లు 69కు చేరారు. కోటి డాలర్ల క్లయింట్ల సంఖ్య 278కు చేరింది.
చదవండి: Cryonics: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment