హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడుల జోరు సాగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ప్రకారం.. 2022 జనవరి–మార్చిలో సంస్థాగత పెట్టుబడులు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా అధికమై రూ.8,375 కోట్లకు ఎగశాయి. 2021 అక్టోబర్– డిసెంబర్‌లో ఇవి రూ.7,600 కోట్లుగా ఉంది. కోవిడ్–19 థర్డ్ వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడడం ఈ వృద్ధికి కారణం.
కార్యాలయాల విభాగంలో పెద్ద డీల్స్ మార్చితో ముగిసిన త్రైమాసికాన్ని నడిపించాయి. గడిచిన 3 నెలల్లో వెల్లువెత్తిన పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఏకంగా 70% ఉండడం విశేషం. 2020లో తగ్గుముఖం పట్టిన తర్వాత దేశీయ పెట్టుబడిదార్ల వాటా కోవిడ్ ముందస్తు స్థాయి అయిన 30%కి చేరుకున్నాయి. ఇది దేశీయ ఇన్వెస్టర్ల విశ్వాసం లో పునరుజ్జీవనాన్ని చూపుతోంది. సంస్థాగత పెట్టుబడుల్లో ఆఫీస్, రిటైల్, ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగాలు 95% కైవసం చేసుకుని, ఆఫీస్ విభాగం తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment