న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు గత ఆరు నెలల్లో స్వల్పంగా పుంజుకున్నాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో దాదాపు 2.94 బిలియన్ డాలర్ల(రూ. 24,110 కోట్లు)కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశీ రియల్టీపై విశ్వాసం కొనసాగడం ఇందుకు దోహదపడింది.
ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక ప్రకారం గతేడాది(2022) తొలి ఆరు నెలల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 2.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధితోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశీ రియల్టీలోకి పెట్టుబడులు బలపడినట్లు నివేదిక పేర్కొంది. వెరసి పెరుగుతున్న పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ప్రపంచ మార్కెట్లలో ఇండియా ఆశావహంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది.
22 లావాదేవీలు
ఈ క్యాలండర్ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రాపర్టీ రంగంలోకి 22 లావాదేవీల ద్వారా దాదాపు 2.94 కోట్ల డాలర్లు ప్రవహించినట్లు జేఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది. ఈ బాటలో ఏడాది చివరి(డిసెంబర్)కల్లా దేశీ రియల్టీలోకి 5 బిలియన్ డాలర్ల సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు లభించనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్–19 తదుపరి కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం తాజా అంచనాలు ప్రకటించింది.
తొలి ఆరు నెలల్లో కార్యాలయ ఆస్తులలో పెట్టుబడులు 105.6 కోట్ల డాలర్ల నుంచి 192.7 కోట్ల డాలర్లకు జంప్ చేయగా.. గృహ విభాగంలో 42.9 కోట్ల డాలర్ల నుంచి 51.2 కోట్లకు ఎగశాయి. ఈ బాటలో వేర్‌హౌసింగ్ విభాగం 36.6 కోట్ల డాలర్లు(గతంలో 20 కోట్ల డాలర్లు), హోటళ్ల రంగం 13.4 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే డేటా సెంటర్లు, రిటైల్, విభిన్న వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోవడం గమనార్హం! గతేడాది వీటిలో వరుసగా 49.9 కోట్ల డాలర్లు, 30.1 కోట్ల డాలర్లు, 39.6 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment