న్యూఢిల్లీ: భారత రియల్టీ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2017 నుంచి 2022 మధ్య వీరి నుంచి మొత్తం 26.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.16 లక్షల కోట్లు) వచ్చాయి. అంతకుముందు ఆరేళ్ల కాలంలో (2011–16) వీరు చేసిన పెట్టుబడులతో పోలిస్తే మూడింతలు అధికంగా వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఇందులో అమెరికా, కెనడా నుంచే 70 శాతం మేర పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రాధాన్య ఎంపికకగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ రంగంలో ఎన్నో కొత్త విధానాలు, సంస్కరణ చర్యలు చేపట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.
పెట్టుబడుల వివరాలు..
► 2017–22 మధ్య భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి దేశీ (డీఐఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మొత్తంగా 32.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2011–16 మధ్య ఇవి 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఆఫీస్ విభాగంలోకే వెళ్లాయి.
►మొత్తం 32.9 బిలియన్ డాలర్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 26.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2011–16 మధ్య వచ్చిన 8.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడింతలు అధికమయ్యాయి.
►డీఐఐల పెట్టుబడులు 2017–22 మధ్య 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
►ఎఫ్‌ఐఐల పెట్టుబడుల్లో యూఎస్‌ఏ నుంచి వచ్చినవి 11.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2011–16 మధ్య ఇవి 3.7 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
►కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో కెనడా నుంచి వచ్చిన ఎఫ్‌ఐఐ పెట్టుబడులు కేవలం 0.5 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం.
►సింగపూర్ నుంచి కూడా మూడు రెట్లకు పైగా పెరిగి 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో ఇవి 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఎన్నో అనుకూలతలు
అధిక జనాభా అనుకూలతలు, అభివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల బలోపేతం, పోటీ ధరలతో అంతర్జాతీయ సంస్థలకు భారత రియల్ ఎస్టేట్ ప్రాధాన్య మార్కెట్‌గా మారింది. రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు ఇవి చోదకంగా నిలుస్తున్నాయి.
బలమైన ఆర్థిక, వ్యాపార మూలాలు సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో విదేశీ వ్యూహాత్మక భాగస్వాములు తమ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తున్నారు’’అని కొలియర్స్ ఇండియా చైర్మన్, ఎండీ సాంకే ప్రసాద్ తెలిపారు. భారత్ దీర్ఘకాల నిర్మాణాత్మక సైకిల్‌లో ఉందని, వచ్చే కొన్నేళ్ల పాటు అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయని కొలియర్స్ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్లు) పీయూష్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment