న్యూఢిల్లీ: బీమా రంగం నుంచి రానున్న కాలంలో మరికొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ కావొచ్చని, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2022–23లో బీమా రంగంలో రూ.1,930 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ మెరుగైన వృద్ధి అవకాశాలు బీమా కంపెనీల నిధుల సమీకరణకు మద్దతునిస్తోందని, దీంతో బలహీన అండర్ రైటింగ్ లాభదాయకతను అవి అధిగమించగలుగుతున్నాయని తెలిపింది.
2022–23లో బీమా రంగం చెల్లించిన మూలధనం రూ.75,300 కోట్లకు పెరిగిందని, 2021–22 నాటికి ఇది రూ.73,400 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2.6 శాతం వృద్ధి చెందింది. ఇదే తరహాలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు, ఐపీవోలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు, దీంతో భారత బీమా రంగం క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యత మెరుగుపడుతుందని తెలిపింది. విదేశీ బీమా సంస్థలు భారత బీమా మార్కెట్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తాయని, ఇప్పటికే భారత కంపెనీలతో ఉన్న జాయింట్ వెంచర్లలో వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయని అంచనా వేసింది.
విదేశీ బీమా సంస్థల భాగస్వామ్యంతో క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యం, పరిపాలనా ప్రమాణాల పరంగా ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. భారత బీమా సంస్థల్లో విదేశీ బీమా కంపెనీలు వాటాలు పెంచుకోవడం మార్కెట్‌కు క్రెడిట్ పాజిటివ్‌గా పేర్కొంది. మొత్తం మీద 2022–23లో బీమా రంగం లాభదాయకత సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్‌లు పెరిగిపోతుండడంతో సాధారణ బీమా రంగం ఫలితాలు ప్రతికూలంగానే ఉన్నట్టు తెలిపింది. స్థిరమైన ధరల పెరుగుదలతో ఈ రంగం అండర్‌రైటింగ్ పనితీరు, లాభదాయకత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment