వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్‌లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్‌లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్‌లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్‌లో ఆర్డర్ పెట్టి కిచెన్‌లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్‌లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్‌లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్‌కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
మొబైల్‌లో ఆర్డర్‌పెట్టి కిచెన్‌లోకి వెళితే..
స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్‌లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్‌పెట్టి కాసేపయ్యాక కిచెన్‌లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్‌లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్‌లో పెట్టుకోవాలి. కిచెన్‌లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.
బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్
ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్‌లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్‌ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.
ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్
మైక్రోఓవెన్‌లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.
ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్‌లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్‌గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment