రెండేళ్ల కనిష్టానికి పీనోట్‌ పెట్టుబడులు | Investments via Pnotes declines in July | Sakshi
Sakshi News home page

రెండేళ్ల కనిష్టానికి పీనోట్‌ పెట్టుబడులు

Published Wed, Aug 24 2022 8:43 AM | Last Updated on Wed, Aug 24 2022 8:45 AM

Investments via Pnotes declines in July - Sakshi

న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో పీనోట్ల పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. జులైకల్లా వీటి విలువ రూ. 75,725 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్‌ చివరికల్లా రూ. 80,092 కోట్లకు చేరిన పీనోట్‌ పెట్టుబడులు 20 నెలల కనిష్టానికి చేరాయి. తదుపరి జులైకల్లా రూ. 75,725 కోట్లకు వెనకడుగు వేశాయి. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడులు క్షీణించాయి. ఇంతక్రితం 2020 అక్టోబర్‌లో మాత్రమే వీటి విలువ ఈ స్థాయిలో అంటే రూ. 78,686 కోట్లను తాకాయి.   (కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు)

పీనోట్‌ జారీ ఇలా 
పీనోట్లుగా పిలిచే పార్టిసిపేటరీ నోట్లను దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) జారీ చేస్తుంటారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాని విదేశీ సంస్థలు దేశీయంగా స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది. అయితే ఇందుకు తగిన పరిశీలన ఉంటుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీలలో జూన్‌ చివరికల్లా పీనోట్‌ పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. రూ. 75,725 కోట్లకు పరిమితమయ్యాయి. యూఎస్‌ ఫెడ్‌ కఠిన పరపతి విధానాల నేపథ్యంలో 10ఏళ్ల బాండ్ల ఈల్డ్స్‌ బలపడుతున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలు దేశీయంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆనంద్‌ రాఠీ షేర్స్, శాంక్టమ్‌ వెల్త్‌ తదితర సంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. (అదానీ గ్రూప్‌ చేతికి ఎన్‌డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!)

ఈక్విటీలే అధికం 
జూన్‌కల్లా నమోదైన పీనోట్‌ పెట్టుబడుల్లో రూ. 66,050 కోట్లు ఈక్విటీలకు చేరగా.. రుణ సెక్యూరిటీలకు రూ. 9,592 కోట్లు లభించాయి. ఇక హైబ్రిడ్‌ సెక్యూరిటీలలో కేవలం రూ. 82 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. జూన్‌కల్లా నమోదైన రూ. 80,092 కోట్లలో ఈక్విటీలకు రూ. 70,644 కోట్లు చేరగా.. డెట్‌ విభాగంలో రూ. 9,355 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. వరుసగా 9 నెలల అమ్మకాల తదుపరి తిరిగి ఈ జులైలో ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడిదారులుగా నిలవడం గమనార్హం! ఈ బాటలో ఆగస్టులోనూ ఈక్విటీలపట్ల అత్యధిక పెట్టుబడులకు మక్కువ చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement