
ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలను విస్మరిస్తూ.., ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో గురువారం ఇంట్రాడే, ముగింపులోనూ సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది.
సెన్సెక్స్ 54 పాయింట్లు పతనమై 65,392 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 19,386 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. యుటిలిటీ, రియల్టీ, ఇంధన, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో, హెల్త్‌కేర్ షేర్లకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 65,833 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 19,512 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 340 పాయింట్లు పెరిగి 65,786 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 19,497 వద్ద ముగిసింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, వినిమయ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి 82.47 స్థాయి వద్ద స్థిరపడింది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో గురువారం ఒక్కరోజే రూ.1.80 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.301.70 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦టైర్ల కంపెనీ సియట్ షేరు 19% పెరిగి రూ.2498 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 20% ర్యాలీ చేసి రూ.2,511 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.10,000 కోట్లకు చేరింది.
♦ బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపడంతో బీఎస్‌ఈ షేరు నాలుగు శాతం లాభపడి రూ.706 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదు శాతం పెరిగి రూ.711 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
♦ టాటా ఏఎంసీ వాటాను పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలపడంతో డీసీబీ బ్యాంకు ఆరుశాతం పెరిగి రూ.129 వద్ద స్థిరపడింది.
సెన్‌కో గోల్డ్ ఐపీవో సక్సెస్
జ్యువెలరీ రిటైల్ రంగ కంపెనీ సెన్‌కో గోల్డ్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(6)కల్లా 73 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. కంపెనీ 94.18 లక్షల షేర్లు విక్రయానికి ఉంచగా.. 69.08 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 301–317 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 405 కోట్లు సమీకరించింది. ప్రధానంగా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 181 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైలర్ల నుంచి 15.5 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.