న్యూఢిల్లీ: ఆరోగ్యంపై వ్యయాలు రోజురోజుకూ పెరిగిపోతుండడంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సభ్యురాలు (నాన్–లైఫ్) టీఎల్ అలమేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులపై నియంత్రణా వ్యవస్థ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందుకు ఐఆర్‌డీఏఐను అనుమతించాలని లేదా ప్రత్యేకంగా ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య బీమా ప్రీమియంల నిరంతర పెరుగుదల నుండి ప్రజలను రక్షించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌గా ఐఆర్‌డీఏఐ కోరుకుంటుందని సభ్యురాలు వివరించారు. ఒక కార్యక్రమంలో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
- ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌గా ఆరోగ్య సంబంధ వ్యవహారాల వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం మాకు పెద్ద కష్టంగా అనిపించదు. అయితే మేము దానిలో ఒకే ఒక భాగాన్ని నియంత్రిస్తున్నాము. మా నియంత్రణలో ఉన్నవి బీమా సంస్థలు మాత్రమే. బీమా సంస్థలకు సంబంధించిన టీపీఏల (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు)పై పూర్తి నియంత్రణ మాకు ఉండదు. ఈ నియంత్రణలకు అనుమతిస్తే, ఆసుపత్రులను సైతం నియంత్రించగలుగుతాము.
- బీమా సంస్థలు తమ ప్రీమియంలను ఎలా పెంచుతాయనే అంశంపై మాకు దృష్టి ఉంది. కానీ మరోవైపు ఎటువంటి నియంత్రణా పరిధిలోలేని సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. అక్కడి పరిస్థితి పూర్తిగా నియంత్రణ లేమితో ఉంది. స్వయంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో మేము మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి.
- మేము స్వయంగా రంగంలోకి దిగినా, ఆసుపత్రులు ప్రతిస్పందించడానికి సమయం పట్టింది. కాబట్టి ఆసుపత్రులపై ఒక రెగ్యులేటర్ ఉండాలనేది మా కోరిక. లేదా ఆసుపత్రులను కూడా నియంత్రించడానికి మమల్ని అనుమతించాలి. తద్వారా వైద్య రంగంపై (లాజికల్ ఎకోసిస్టమ్‌పై) పూర్తి నియంత్రణ సాధ్యమవుతుంది.
- కోవిడ్–19కి సంబంధించి కొన్ని ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించడానికి నిరాకరించాయన్న విషయం ఐఆర్‌డీఏఐ దృష్టికి వచ్చింది.
- క్యాష్‌లెస్ (చికిత్స) కోసం ముందుకు రావాలని మేము ఆసుపత్రులను కోరుతున్నాము. జనాభాను పరిగణనలోకి తీసుకుంటే మనకు చాలా కొద్ది ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. బీమా చేయబడిన జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, బీమా సంస్థలతో నగదు రహిత ఒప్పందాలు చేసుకున్న ఆసుపత్రుల సంఖ్య కూడా తక్కువే. ఆసుపత్రులు తమ బిల్లులను పెంచడం, తమ టారిఫ్‌లను మార్చుకోవడం వంటి సమస్యలనూ ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.
- హెల్త్‌కేర్ రంగం మొత్తం నియంత్రిత వ్యవస్థ కిందకు వస్తేనే అంతిమంగా పాలసీదారుని లేదా సాధారణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ జరుగుతుంది.
- తద్వారా ప్రజలు బీమాను కొనుగోలు చేయడం, దాని ప్రయోజనాలు పొందడంపై మరింత విశ్వాసాన్ని పొందుతారు. బీమా వ్యవస్థను విశ్వసిస్తారు. ఇది బీమా ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మందిని ప్రేరేపిస్తుంది.
కరోనాకి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సభ్యురాలి కీలక వ్యాఖ్య
Published Tue, Dec 7 2021 12:58 PM | Last Updated on Tue, Dec 7 2021 1:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment