న్యూఢిల్లీ: కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు పరిహారాన్ని తిరస్కరించొద్దని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఆదేశించింది. యాంటీబాడీ కాక్‌టెయిల్ కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తుండడం తెలిసిందే. అయితే, దీన్ని ప్రయోగాత్మక చికిత్సగా పేర్కొంటూ బీమా కంపెనీలు పరిహార క్లెయిమ్‌లు ఆమోదించడం లేదు. ‘‘కరోనాకు సంబంధించి క్లెయిమ్‌లను తిరస్కరించడం లేదా యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్సకు అయిన వ్యయాలను ‘ప్రయోగాత్మక చికిత్సలు’ పేరిట తగ్గించి ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి గతేడాది మే నెలలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత క్లెయిమ్‌లకు పరిహారాన్ని నిబంధనల మేరకు చెల్లించాలని ఆదేశించింది. ఈ విధమైన బకాయిలను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
కరోనా మూడో విడత చికిత్సల ప్రోటోకాల్‌పై ఎంతో అనిశ్చితి నెలకొన్నట్టు బీమా బ్రోకింగ్ సంస్థ సెక్యూర్‌నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్సా వ్యయాలను చెల్లించాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించినప్పటికీ.. బీమా సంస్థలపై పెద్ద భారం పడబోదన్నారు. ఇప్పటికే ఈ తరహా చికిత్సలకు బీమా సంస్థలు పరిహారాన్ని తిరస్కరించినట్టయితే.. మళ్లీ తిరిగి దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment