న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల దిగ్గజం జాగ్వార్ 2025లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ డెలివరీలను ప్రారంభించనుంది. ఈ ఏడాది కొత్త డిజైన్ల వివరాలను విడుదల చేయనున్నట్లు, 2024లో నిర్దిష్ట మార్కెట్లలో విక్రయాలను ప్రారంభించనున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తాత్కాలిక సీఈవో అడ్రియన్ మార్డెల్ తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్, అటానామస్ కార్ల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను కల్పించేందుకు ముందుగా తమ సిబ్బందికి తగు శిక్షణనివ్వడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
గతేడాది సెప్టెంబర్‌లో 29,000 మందికి శిక్షణా ప్రోగ్రాంను ప్రారంభించినట్లు మార్డెల్ చెప్పారు. రాబోయే రోజుల్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ వాహనాల్లో పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం ఈ ఏడాది ప్రీ–ఆర్డర్లు తీసుకోనున్నట్లు మార్డెల్ తెలిపారు. మరోవైపు, పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ వాహనాల బ్రాండ్‌గా జాగ్వార్ పరివర్తన ప్రక్రియ సజావుగా ముందుకు సాగుతోందని కంపెనీ 2022–23 వార్షిక నివేదికలో చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
(ఇదీ చదవండి: రోడ్‌షోలు నిర్వహించున్న ఎల్‌ఐసీ.. ఎక్కడో తెలుసా?)
ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల కొరత తదితర సవాళ్ల కారణంగా సంస్థ గత ఆర్థిక సంవత్సరం వ్యాపారపరంగా పలు సమస్యలు ఎదుర్కొందని ఆయన వివరించారు. సరఫరాలపరమైన సమస్యలను అధిగమించేందుకు కంపెనీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైందని చంద్రశేఖరన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment