వేల కోట్లు సంపాందించిన వ్యాపారవేత్తలు తమ తదనంతరం వ్యాపార సామ్రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్.. తనకు ఆ భాగ్యం కలగడం లేదని, తన కూతురు జయంతి చౌహాన్ వారసత్వంగా కంపెనీ వ్యాపారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అప్పట్లో తెగ బాధపడిపోయారు.
ఎవరీ జయంతి చౌహాన్?
జయంతి చౌహాన్... బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్ ఒక్కగానొక్క కూతురు. రూ. 7వేల కోట్ల సంస్థను నడపడానికి ఆసక్తి చూపడం లేదని వెల్లడించడంతో ఆ మధ్య వార్తల్లో నిలిచారు. తన తర్వాత వ్యాపారాన్ని నడిపే వారు ఎవరూ లేనందున పూర్తి టేకోవర్ డీల్ కోసం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. అయితే కంపెనీ వాల్యుయేషన్ విషయంలో ఒప్పందం కుదురకపోవడంతో ఆ చర్చలు నిలిచిపోయాయి.
ఇప్పుడిప్పుడే ఆసక్తి..
తాజాగా బిస్లరీ కంపెనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అధికారిక హైడ్రేషన్ పార్టనర్‌గా మారింది. ఈ ఒప్పందం కుదరడంలో జయంతి చౌహాన్ కీలక పాత్ర పోషించారు. అంటే ఆమె కంపెనీ వ్యాపార వ్యవహారాలపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతోందని అర్థమవుతోంది.
ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన
దేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమలో బిస్లరీ అగ్రగామి సంస్థ. 50 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి 128 ప్లాంట్లు ఉన్నాయి. థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా వంటి బ్రాండ్‌లను స్థాపించడం వెనుక రమేష్ చౌహాన్ ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 82 ఏళ్లు. వయసు పైబడం.. కూతురు వారసత్వంగా కంపెనీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో కంపెనీని విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
జయంతి చౌహాన్ ప్రస్తుతం బిస్లరీ సంస్థకు వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ నిర్ణయాలు, రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, ఆమె ఆసక్తి అంతా ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీలో ఉంది. ఆమె ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్ వంటి సంస్థలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment