న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు.
తప్పని పరిస్థితిలోనే...
మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్‌ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
ఉద్యోగుల తొలగింపు ఉండదు
మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్‌హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్‌ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment