
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్నివాల్‌పై కొత్త స్కీమ్ ప్రకటించింది. కొనుగోలుదారులు కారు పనితీరుపై సంతృప్తి చెందని పక్షంలో కొన్న 30 రోజుల్లో వాపసు చేయొచ్చని తెలిపింది. కార్నివాల్ ఎంపీవీలోని అన్ని వేరియంట్స్‌కి ‘శాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ స్కీమ్’ వర్తిస్తుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ కింద వాపసు చేయాలంటే కొన్న తేదీ నుంచి ప్రయాణించిన దూరం 1,500 కి.మీ.లకు మించకూడదు.
అలాగే ఎలాంటి డ్యామేజీలు, పెండింగ్ క్లెయిమ్‌లు మొదలైనవి ఉండకూడదు. హైపోథికేషన్ ఉండకూడదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. వాపసు చేస్తే ఎక్స్–షోరూం ధరలో దాదాపు 95% మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ మొదలైన వాటికి అయిన ఇతర ఖర్చులకు కవరేజీ ఉంటుంది. ప్రస్తుత గడ్డుకాలంలో తమ కస్టమర్లకు మరింత భరోసా కల్పించేందుకు ఈ స్కీము దోహదపడగలదని కియా ఇండియా ఈడీ టే–జిన్ పార్క్ తెలిపారు.
చదవండి: New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్!