న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ కియా.. భారత మార్కెట్లో 2025 నాటికి మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయని కియా ఇండియా ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్ మంగళవారం వెల్లడించారు. సెల్టోస్ అప్‌డేటెడ్ వెర్షన్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కియా 2.0 వ్యూహంలో భాగంగా సమీప భవిష్యత్తులో భారత ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో కంపెనీ వాటాను 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కియాకు సుమారు 7% వాటా ఉందన్నారు. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 20%కి చేరుతుందని అంచనా వేశారు.
అనంతపురం ప్లాంటులో: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన భారత్ విషయంలో దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు టే–జిన్ పార్క్ తెలిపారు. ‘ఇక్కడి వృద్ధి తీరుకు అనుగుణంగా వాటాను పెంచుకోవాలంటే కంపెనీ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న మోడళ్లు సరిపోవు. అందుకే కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాం. కొత్తగా వచ్చే మూడు మోడళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కియా అభివృద్ధి చేసిన రీక్రియేషనల్ (వినోద) వెహికల్స్. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో వీటిని అసెంబుల్ చేస్తాం’ అని వివరించారు.
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఏడాది వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.5 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది ఏడాదికి 4.3 లక్షల యూనిట్లకు చేరుకోగలదని అన్నారు. డిమాండ్ బలంగా కొనసాగితే అనంతపురం ప్లాంటులో కొత్త లైన్ ఏర్పాటును కియా పరిశీలించవచ్చని పేర్కొన్నారు.
మరో 15 ఏళ్లు..
భారత్‌లో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగవంతం అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే యూరప్ మార్కెట్‌లా కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) కూడిన వాహనాలు మరో 10–15 సంవత్సరాల పాటు ఇక్కడ కొనసాగుతాయని పార్క్ అన్నారు.
డీజిల్ మోడళ్లు సైతం..: డిమాండ్ కొనసాగుతున్నందున దేశంలో డీజిల్ వాహనాల విక్రయాన్ని కొనసాగిస్తామని కంపెనీ ఎండీ తెలిపారు. ఉద్గార నిబంధనలు కఠినతరం అయితే హైబ్రిడ్, ఇతర సాంకేతికతలను పరిగణిస్తామని వివరించారు. కాగా, కంపెనీ భారత మార్కెట్‌పై దృష్టి సారించడంతో ఎగుమతులు మొత్తం ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 25 నుండి 20%కి తగ్గవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment