గ్రేటర్‌లో 5,568 రిజిస్ట్రేషన్లు.. విలువ రూ.2,695 కోట్లు | Knight Frank Report Details About Hyderabad Registrations | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో 5,568 రిజిస్ట్రేషన్లు.. విలువ రూ.2,695 కోట్లు

Published Sat, Feb 12 2022 10:33 AM | Last Updated on Sat, Feb 12 2022 10:46 AM

Knight Frank Report Details About Hyderabad Registrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  2022 ఏడాది వస్తూ వస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ రియల్టీ రంగంలో జోష్‌ను తీసుకొచ్చింది. జనవరిలో రికార్డ్‌ స్థాయిలో రూ.2,695 కోట్ల విలువైన 5,568 గృహాల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. ఇందులో 71 శాతం గృహాలు రూ.50 లక్షల లోపు ధర ఉన్నవేనని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 

రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే.. 
రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 71 శాతం ఈ తరహా గృహాలే ఉండగా.. గతేడాది వీటి వాటా 75 శాతంగా ఉండటం గమనార్హం. లగ్జరీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. గతేడాది జనవరి లాగే గత నెలలో కూడా రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాలు 32 శాతం, రూ.25–50 లక్షలవి 39 శాతం, రూ.50–75 లక్షలవి 13 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.1–2 కోట్లవి 6 శాతం, రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

1,000 చ.అ. ఉండాల్సిందే
కరోనా మహమ్మారితో కొనుగోలుదారులు అభిరుచులో మార్పు లు వచ్చాయి. వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతున్న తరుణంలో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఉండాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని అప్‌గ్రేడ్‌ చేయడమే లేదా ఎక్కువ విస్తీర్ణం ఉన్న కొత్త గృహాన్ని కొనుగోలు చేయడమే జరిగాయి. దీంతో గత నెలలో వెయ్యి చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో వృద్ధి నమోదయింది. గతేడాది జనవరిలో 1,000 – 3,000 చ.అ. విస్తీర్ణమైన గృహాలు 78 శాతం రిజిస్ట్రేషన్లు జరగగా.. గత నెలలో 82 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో 500–1,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీలు గతేడాది జనవరిలో 16 శాతం ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3 శాతం తగ్గి 13 శాతానికి చేరింది. గతేడాది లాగే ఈ ఇయర్‌ జనవరిలోనూ 3 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 3 శాతంగా ఉన్నాయి. 

ఓమిక్రాన్‌ ఎఫెక్ట్‌
కోవిడ్‌ మూడో దశ హైదరాబాద్‌తో సహా దేశంలోని ఇతర నగరాలలోని రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపించింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రాజెక్ట్‌ సైట్ల సందర్శనలు తగ్గాయి. చాలా మంది గృహ కొనుగోలుదారులు కొను గోలు నిర్ణయం వాయిదా వేశారు. దీంతో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో క్షీణత నమోదయిందని తెలిపింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ల 27 శాతం తక్కువగా జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.  

హైదరాబాద్‌లో తగ్గాయి.. 
గత ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ వాటా 22 శాతం ఉండగా.. గత నెలలో 14 శాతానికి తగ్గాయి. రంగారెడ్డిలో చూస్తే.. గతేడాది జనవరిలో 38 శాతం వాటా ఉండగా.. గత నెలకొచ్చేసరికి 48 శాతానికి పెరిగింది. 2021 జనవరిలో మేడ్చల్‌–మల్కజ్‌గిరి 37 శాతం వాటాను కలిగి ఉండగా.. 2022 జనవరి నాటికి 35 శాతానికి తగ్గింది. గతేడాది జనవరి తరహాలోనే ఈ ఏడాది జనవరిలోనూ సంగారెడ్డి 3 శాతం రిజిస్ట్రేషన్‌ వాటాను కలిగి ఉంది. 

చదవండి: ఇకనైనా మేల్కోండి.. లేకపోతే ప్రతికూలతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement