registraions
-
తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1— KTR (@KTRBRS) October 7, 2024 -
ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?
ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు. ‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్‌లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం? సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) లిండా (సౌదీ అరేబియా) స్నేక్ (మలేషియా) ఫ్రైడే (ఇటలీ) ఇస్లాం (చైనా) సారా (మొరాకో) చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్) రోబోకాప్ (మెక్సికో) డెవిల్ (జపాన్) నీలం (ఇటలీ) సున్తీ (మెక్సికో) ఖురాన్ (చైనా) హ్యారియెట్ (ఐస్లాండ్) మంకీ (డెన్మార్క్) థోర్ (పోర్చుగల్) 007 (మలేషియా) గ్రిజ్మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) తాలులా హవాయి (న్యూజిలాండ్) బ్రిడ్జ్(నార్వే) ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ) మెటాలికా (స్వీడన్) ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్) అనల్ (న్యూజిలాండ్) నుటెల్లా (ఫ్రాన్స్) వోల్ఫ్ (స్పెయిన్) టామ్-టామ్ (పోర్చుగల్) కెమిల్లా (ఐస్లాండ్) జుడాస్ (స్విట్జర్లాండ్) డ్యూక్ (ఆస్ట్రేలియా) -
‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
దేశంలోని వైద్యులకు సంబంధించిన ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ కమిషన్ పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, దీని ట్రయల్ రాగల ఆరు నెలల్లో ప్రారంభం కానున్నదని సమాచారం. ట్రయల్ అనంతరం ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ కింద దేశంలోని ప్రతి డాక్టర్‌కి యూనిక్ ఐడీ అందజేస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వైద్యునికి గుర్తింపు కల్పిస్తారు. ఈ ఐడీలో ఆ వైద్యుని శిక్షణ, అతని లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పత్రాల గురించిన సమాచారం ఉంటుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ ప్రత్యేక ఐడీని ఐటీ ప్లాట్ఫారమ్నకు లింక్ చేస్తుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర మాలిక్ మాట్లాడుతూ ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’పై ఇప్పటికే చాలా కసరత్తు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్యునికి రెండుసార్లు యూనిక్ ఐడీ ఇస్తారు. అతను ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన ఐడీ తాత్కాలికంగా ఉంటుంది. అతని చదువు పూర్తయ్యాక అతనికి శాశ్వత సంఖ్య ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు శాశ్వత యూనిక్ ఐడీ ఇస్తారు. ఈ ప్రత్యేకమైన ఐడీని అందుకున్న వైద్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో దాదాపు 14 లక్షల మంది నమోదిత వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. దేశంలోని 200కి పైగా మెడికల్ కాలేజీల్లో 1.08 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండటం అవసరం. అయితే భారతదేశం చాలా కాలం క్రితమే ఈ ప్రమాణాన్ని అధిగమించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ చెబుతోంది. ఇది కూడా చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు ‘వీర్యం నీరు’.. తరువాత జరిగిందిదే! -
చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!
ChatGPT for Android users: ఓపెన్ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్ ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్‌బాట్‌కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది. Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది. We’re rolling out ChatGPT for Android users next week https://t.co/3tNLNcG5Kw — Mira Murati (@miramurati) July 21, 2023 చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ ♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్‌జీపీటీ అని సెర్చ్ చేయాలి ♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి. ♦ ఒకసారి యాప్ లాంచ్ అయిన తరువాత, ఈ యాప్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది. ♦ అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాగా చాట్పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు డౌన్లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్‌గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
AP: ఊరిలోనే రిజిస్ట్రేషన్
సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రిజిస్ట్రేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలుత 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసింది. ఎలాంటి భూ వివాదాలు లేని, సమగ్ర భూ సర్వే పూర్తయిన 33 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మి, రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నం సచివాలయాల్లో సేవలను ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో నిర్దేశించిన 31 సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు ఏం జరుగుతోందంటే.. స్థిర, చరాస్తులు, విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు, దళారులు నిర్ణయించిన ధర చెల్లించాల్సి వచ్చేది. లేని పక్షంలో డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టి వెనక్కు పంపుతున్న సంఘటనలు కోకొల్లలు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు దళారులతో కుమ్మక్కు కావడంతో అక్రమ తంతు యథేచ్ఛగా నడిచేది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందేలా చర్యలు తీసుకుంది. భూముల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలన్నీ సచివాలయ కేంద్రంగానే చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. ప్రక్రియ సమర్థవంతంగా జరగాలంటే భూముల వివాదాలు ఉండకూడదని భావించింది. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి తొలుత అలాంటి గ్రామాలను ఎంపిక చేసింది. సిబ్బందికి అవగాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గ్రామ సచివాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి మరీ డాక్యుమెంట్ల పరిశీలన, చలానా తదితర విషయాలపై సమగ్రంగా సమాచారం అందించారు. ఇది వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందే సేవలన్నీ సచివాలయాలకు అనుసంధానం చేశారు. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్స్లీప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలిముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, దస్తావేజు, సెటిల్మెంట్ దస్తావేజు, దాన విక్రయ, తనఖా, చెల్లు రశీదు, భాగ పరిష్కార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు ఉన్న ఊళ్లోనే అందుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సచివాలయంలో ఒక పంచాయతీ సెక్రటరీకి ప్రభుత్వం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ హోదా కల్పించింది. ఇకపై సచివాయలంలో జరిగే స్థిర, చరాస్తి క్రయ, విక్రయాల విక్రయం, కోనుగోలుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మిలో ఇప్పటి వరకు 101 రిజిస్ట్రేషన్లు జరిగ్గా వీటి విలువ రూ.26,58,522గా ఉంది. రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. లేఅవుట్లు ఎక్కువగా ఉన్న కారణంతో భారీగా ఆదాయం సమకూరినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.16,96,53,581 విలువ చేసే 302 స్థిర, చరాస్తులు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.73,23,939 ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. త్వరలో మరిన్ని గ్రామాల్లో.. జిల్లాలో త్వరలో మరిన్ని గ్రామాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. అందులో నేలటూరు, నందిగంపాడు, జగన్నాథపురం, జగన్నాథపురం(గంగవరం), చిడిపి, తిమ్మరాజుపాలెం, బల్లిపాడు, పేరరామచంద్రపురం, అనపర్తి–5, కొప్పవరం, మహేంద్రవాడ–1, పోలమూరు–1, రామవరం–1, కుతుకులూరు–1, పెదపర్తి, పూలగుర్త, ఇల్లపల్లి, ఇల్లపల్లి(తుమ్మలాపల్లి), ఇల్లపల్లి(రాళ్లకండ్రిగ), కోమారిపాలెం–2, తొస్సిపూడి, పందలపాక–1,కొంకుదురూరు–1, దామిరెడ్డిపల్లి, బొమ్మూరు–2, రాజవోలు–1, శ్రీకృష్ణపట్నం, జి.ఎర్రవరం, నామవరం, సుభద్రంపేట, నార్త్ తిరుపతి రాజాపురం సచివాలయాల్లో త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం రిజిస్ట్రేషన్ పక్రియపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. స్థిరాస్తి క్రయ, విక్రయాలు, ఏ సేవకు ఎంత వసూలు చేయాలన్న విషయమై సమగ్రంగా చెబుతున్నాం. చలానాలు, ప్రభుత్వ ఫీజులు తీసుకోవాల్సిన వాటిపై చెబుతున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఎలా అధిగమించాలో స్పష్టం చేస్తున్నాం. తొలి విడతలో కేటాయించిన వాటిలో రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో సైతం పారదర్శకంగా జరిగేలా చూస్తాం. – ఆనందరావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు 13.34 లక్షలు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశంలో 13,34,385 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో లిఖతపూర్వకంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ గణాంకాలను ఇందులో కలపలేదని చెప్పారు. 68 నగరాల్లో 2,877 పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు అనుమతి ఇచ్చామన్నారు. 9 ఎక్స్‌ప్రెస్ రహదారులు, 16 జాతీయ రహదారుల వద్ద 1,576 చార్జింగ్ స్టేషన్లకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. ఇండియాలో మొత్తం 27,25,87,170 రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 207 దేశాల్లో రిజిస్టర్ అయిన 205.81 కోట్ల వాహనాల్లో ఈ సంఖ్య 13.24 శాతమని వివరించారు. దేశంలో జాతీయ రహదారుల వెంట 1,056 పురుష టాయిలెట్లు, 1,060 మహిళల టాయిలెట్లు ఉన్నాయని మరో ప్రశ్శకు సమాధానంగా నితిన్ గడ్కరీ చెప్పారు. -
అయ్యో ఓలా ఎలక్ట్రిక్: కస్టమర్ల షాక్ మమూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దేశంలో ఎలక్ట్రానిక్ టూవీలర్స్ సెగ్మెంట్లో టాప్‌లో ఒక వెలుగు వెలిగిన ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా మరో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి భారీగా తగ్గిపోతోంది. అమ్మకాలు లేక వెలవెలబోతోంది. రిజిస్ట్రేషన్లు పతనంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఓలా రిజిస్ట్రేషన్లు మే 30తో పోలిస్తే జూన్ 30 నాటికి 30 శాతానికి పైగా తగ్గాయి. అయితే ఏప్రిల్,మే నెలల్లో నెలవారీగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ జూన్‌లో స్వల్పంగా పెరిగాయి. జూలై 2 నాటి వాహన్ పోర్టల్ తాజా సమాచారం ప్రకారం జూన్‌లో నమోదైన మొత్తం ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు)42,233 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో 2022లో ఇప్పటివరకు కేటగిరీలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 2.4 లక్షల యూనిట్లకు చేరుకుంది. కానీ భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ జూన్‌లో బాగా తగ్గిపోయాయి. అధికారిక డేటా ప్రకారం జూన్ 30 నాటికి 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకినావా ఆటోటెక్ దేశవ్యాప్తంగా 6,976 వాహనాల రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూటర్స్ 6,534తో రెండవ స్థానంలో నిలిచింది. 6,486 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్లతో హీరో కంపెనీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఏథర్ ఎనర్జీ 3,797 రిజిస్ట్రేషన్స్, 2,419 రివోల్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇటీవల ప్రమాదానికి గురైన కంపెనీల్లో ఒకటైన ప్యూర్ ఈవీ రిజిస్ట్రేషన్లు 1125 యూనిట్లకు తగ్గాయి. ఈ ఏడాది మేలో 1,466 యూనిట్లు ఏప్రిల్‌లో 1,757 యూనిట్లను విక్రయించింది. ఒకినావా మేలో 9,302 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ 9,225 యూనిట్ల ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఇది ఇలా ఉంటే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీలలో సెక్యూరిటీ లోపాలున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు, బ్యాటరీ పేలుళ్లు, బ్యాటరీలలో లోపాలు లాంటి అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా దాదాపు అన్ని కంపెనీలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. -
అభివృద్ధి పనులపై సమీక్ష
కూకట్పల్లి: ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్‌తో చర్చించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన 58, 59 జీఓలపై చర్చించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తుందని తెలిపారు. అంతకు మించి భూమి ఉంటే రిజి్రస్టేషన్ ధరలకు అనుగుణంగా నాల్గో వంతు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇందిరానగర్ బస్తీతో పాటు మరికొన్ని బస్తీల్లో క్రమబద్దీకరణ కాని స్థలాల వివరాలను ఎమ్మెల్యే మాధవరం కలెక్టర్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీనిచి్చనట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి అన్ని ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. పెండింగ్‌లో ఉన్న పింఛన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరు..మన బడి ద్వారా కూకట్పల్లి నియోజకవర్గంలో 12 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. -
గ్రేటర్లో 5,568 రిజిస్ట్రేషన్లు.. విలువ రూ.2,695 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2022 ఏడాది వస్తూ వస్తూ గ్రేటర్ హైదరాబాద్ రియల్టీ రంగంలో జోష్‌ను తీసుకొచ్చింది. జనవరిలో రికార్డ్ స్థాయిలో రూ.2,695 కోట్ల విలువైన 5,568 గృహాల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇందులో 71 శాతం గృహాలు రూ.50 లక్షల లోపు ధర ఉన్నవేనని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే.. రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 71 శాతం ఈ తరహా గృహాలే ఉండగా.. గతేడాది వీటి వాటా 75 శాతంగా ఉండటం గమనార్హం. లగ్జరీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. గతేడాది జనవరి లాగే గత నెలలో కూడా రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాలు 32 శాతం, రూ.25–50 లక్షలవి 39 శాతం, రూ.50–75 లక్షలవి 13 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.1–2 కోట్లవి 6 శాతం, రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 1,000 చ.అ. ఉండాల్సిందే కరోనా మహమ్మారితో కొనుగోలుదారులు అభిరుచులో మార్పు లు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు కొనసాగుతున్న తరుణంలో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఉండాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని అప్‌గ్రేడ్ చేయడమే లేదా ఎక్కువ విస్తీర్ణం ఉన్న కొత్త గృహాన్ని కొనుగోలు చేయడమే జరిగాయి. దీంతో గత నెలలో వెయ్యి చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో వృద్ధి నమోదయింది. గతేడాది జనవరిలో 1,000 – 3,000 చ.అ. విస్తీర్ణమైన గృహాలు 78 శాతం రిజిస్ట్రేషన్లు జరగగా.. గత నెలలో 82 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో 500–1,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీలు గతేడాది జనవరిలో 16 శాతం ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3 శాతం తగ్గి 13 శాతానికి చేరింది. గతేడాది లాగే ఈ ఇయర్ జనవరిలోనూ 3 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 3 శాతంగా ఉన్నాయి. ఓమిక్రాన్ ఎఫెక్ట్ కోవిడ్ మూడో దశ హైదరాబాద్‌తో సహా దేశంలోని ఇతర నగరాలలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై ప్రభావం చూపించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రాజెక్ట్ సైట్ల సందర్శనలు తగ్గాయి. చాలా మంది గృహ కొనుగోలుదారులు కొను గోలు నిర్ణయం వాయిదా వేశారు. దీంతో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో క్షీణత నమోదయిందని తెలిపింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ల 27 శాతం తక్కువగా జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. హైదరాబాద్‌లో తగ్గాయి.. గత ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ వాటా 22 శాతం ఉండగా.. గత నెలలో 14 శాతానికి తగ్గాయి. రంగారెడ్డిలో చూస్తే.. గతేడాది జనవరిలో 38 శాతం వాటా ఉండగా.. గత నెలకొచ్చేసరికి 48 శాతానికి పెరిగింది. 2021 జనవరిలో మేడ్చల్–మల్కజ్గిరి 37 శాతం వాటాను కలిగి ఉండగా.. 2022 జనవరి నాటికి 35 శాతానికి తగ్గింది. గతేడాది జనవరి తరహాలోనే ఈ ఏడాది జనవరిలోనూ సంగారెడ్డి 3 శాతం రిజిస్ట్రేషన్ వాటాను కలిగి ఉంది. చదవండి: ఇకనైనా మేల్కోండి.. లేకపోతే ప్రతికూలతే! -
సూపర్‌స్టార్ మహేశ్.. హైదరాబాద్‌లో ప్లాటు కొనుగోలు.. ఎక్కడంటే ?
Mahesh Babu buys plot in Jubilee Hills : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జూబ్లీహిల్స్‌లో కొత్త ప్లాటు కొనుగోలు చేశారు. నగరంలోనే రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ మనీ కంట్రోల్ కథనం ప్రచురించింది. ప్లాటు ధర ఎంతంటే మహేశ్‌బాబు కొనుగోలు చేసిన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాల ప్రకారం... యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును కొనుగోలు చేశారు. ఇందుకు గాను మహేశ్‌బాబు రూ.26 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇందులో స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారు. 2021 నవంబరు 17న ఈ సేల్‌డీడ్ జరిగినట్టు సమాచారం. ఇక్కడే రేట్లు అధికం జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాకు సంబంధించి సగటున ఒక్కో ప్లాటు వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ గజం భూమి ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకుగా ఉంది. ఇక మహేశ్‌బాబు కొనుగోలు చేసిన స్థలం విషయానికి వస్తే.. గత యజమాని అయిన యర్రం విక్రాంత్ రెడ్డి.. ఈ స్థలంలో ఉన్న పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇళ్లు కట్టాలని ముందుగా అనుకున్నారు... అయితే కొత్త నిర్మాణ పనులు చేపట్టకుండా.. ఈ ఇంటి స్థలాన్ని మహేశ్‌బాబుకు అమ్మేశారు. ఇంటి స్థలం కొనుగోలుపై ప్రిన్స్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. హైదరాబాద్‌లో రియల్ పికప్ కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించి, స్టార్టప్‌లు ఎక్కువగా వెలుస్తున్న బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రియల్టీ పరిస్థితులు త్వరగా చక్కబడ్డాయి. కోవిడ్ తర్వాత ఇక్కడ భూముల ధరలు 2 నుంచి 6 శాతం వరకు పెరిగాయి. చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు? -
రిజిస్ట్రేషన్ శాఖను కుదిపేసిన నకిలీ చలానాల వ్యవహారం
-
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే.. మ్యుటేషన్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్ ప్రక్రియను పైలట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్‌ను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియ కోసం జీహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేశారు. అయితే, జీహెచ్ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్‌కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని మ్యుటేషన్ అంటే.. ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్) చేసేవారు. అయితే, ఈ మ్యుటేషన్ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు మరో మార్గం ?
వెబ్‌డెస్క్ : కోవిన్ యాప్‌తో పాటు ఇతర ప్రైవేటు అప్లికేషన్ల ద్వారా కూడా త్వరలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. పేటీఎం, మేక్ మై ట్రిప్‌తో పాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రభుత్వానికి సహాకరించేందుకు ముందుకు వచ్చాయంటూ రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. థర్డ్‌పార్టీ టీకా రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యలు తీర్చేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. టీకా రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలలో ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపించాయి. అపోలో, మాక్స్ వంటి ఆస్పత్రులతో పాటు మేక్ మై ట్రిప్, 1 మిల్లీగ్రామ్, పేటీఎం, ఇన్ఫోసిస్ తదితర మొత్తం 15 సంస్థలు ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. సహాయకారిగా మేక్ మై ట్రిప్ సీఈవో రాజేశ్ మాగౌ మాట్లాడుతూ వ్యాక్సిన్ బుకింగ్ చేసుకునేందుకు ప్రజలకు సహయకారిగా ఉండాలని నిర్ణయించామని, అందుకే మేక్ మై ట్రిప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సేవలకు ముందుకు వచ్చామని వివరించారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు పేటీఎం,అపోలో, మాక్స్ నిరాకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పేటీఎంకి వెబ్‌సైట్‌కి పది కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మేక్ మై ట్రిప్ అప్లికేషన్‌కి 1.20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. చదవండి: కోవిడ్ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్ టాప్ -
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమయ్యింది. అర్హులు టీకా తీసుకోవాలంటే ముందుగా కో–విన్ 2.0 పోర్టల్ (http://cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, అపాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. 1. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. 2. ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్ నొక్కాలి. 3. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి ప్రవేశిస్తారు. 4. పేరు, వయసు వంటి వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి. 5. ఒకవేళ 45 నుంచి 59 ఏళ్ల వయసుండి, వ్యాధులతో బాధపడుతూ ఉంటే గుర్తింపు కార్డుతోపాటు ఆర్ఎంపీ సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 6. రిజిస్ట్రేషన్ బటన్ నొక్కాలి. 7. ఇప్పుడు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. 8. ఒకే ఫోన్ నంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది(గరిష్టంగా నలుగురు) రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ‘యాడ్ మోర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. వారి వివరాలు నమోదు చేయాలి. 9. ‘షెడ్యూల్ అపాయింట్మెంట్’ బటన్ నొక్కాలి. 10. రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారంతోపాటు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి. 11. ఒక స్లాట్‌ను ఎంచుకొని, ‘బుక్’ బటన్‌పై నొక్కాలి. 12. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్తో కూడిన సందేశం ఫోన్‌కు వస్తుంది. 13. వ్యాక్సినేషన్ కంటే ముందు వరకూ అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే తేదీ, సమయం మార్చుకోవచ్చు. ఇందుకోసం అదే ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లో మళ్లీ లాగిన్ కావాలి. 14. టీకా తీసుకున్న తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా... కరోనా టీకా తీసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా అపాయింట్మెంట్ పొందవచ్చు. 1. మొబైల్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2. యాప్ ఓపెన్ చేసి, కో–విన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 3. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. 4. ఫోన్ నెంబర్, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 5. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి వెళ్లాలి. దీనితర్వాత కో–విన్ 2.0 పోర్టల్‌లోని ప్రక్రియనే యథాతథంగా అనుసరిస్తూ ముందుకెళ్లాలి. పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ కో–విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘కరోనా టీకా కోసం కో–విన్ పోర్టల్ (www.cowin.gov. in) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ పొందాలి. రిజిస్ట్రేషన్ల కోసం కో–విన్ యాప్ అంటూ ఏదీ లేదు. ప్లేస్టోర్‌లో ఉన్న కో–విన్ యాప్ కేవలం అడ్మినిస్ట్రేటర్ల కోసమే. పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా తీసుకునే సమయం వరకూ లబ్ధిదారులు పోర్టల్‌లో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు, తొలగింవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రికార్డు మొత్తం లాక్ అవుతుంది. వివరాలను మార్చడానికి వీలుండదు’’ అని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. -
ఫస్ట్ డే... 2,155
రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాత పద్ధతిలో దానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. పాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటు ప్రజలకు, అటు సిబ్బందికి సుపరిచితం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాతపద్ధతిలో దానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. హైదరాబాద్ శివార్లలో భారీగా.. పాత పద్ధతిలో మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అటు డాక్యుమెంట్ రైటర్లు, ఇటు లావాదేవీల కోసం వచ్చే ప్రజలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఎల్బీ నగర్, గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్ లాంటి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ప్రజలు వచ్చారు. సోమవారం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి 10 నిమిషాల్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి గంటలోపే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఇచ్చేశామని సిబ్బంది పేర్కొన్నారు. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు) ధరణి ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లాట్లను, చలాన్లను కూడా కార్డ్ పద్ధతిలోకి మార్చి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. సోమవారం ఒక్కరోజే 5,556 ఈ చలాన్లు కట్టగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.76.1 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, ఈ నెలలో మొత్తం 12,359 చలాన్లు రాగా, 135.6 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ చలాన్లు ఆరునెలల పాటు చెల్లుబాటవుతాయి కాబట్టి ఆలోపు ప్రజలు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశముంది. తొలిరోజు రద్దీ ఉంటుందనే అంచనాతో ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా ముగిసింది. ఎల్ఆర్ఎస్....తలనొప్పులు పాత పద్ధతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ లేని భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారనే అంచనాతో చాలా మంది సోమవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సిబ్బంది తేల్చిచెప్పడంతో నిరాశకు గురయ్యారు. దీనిపై ప్రజలు కొన్నిచోట్ల సబ్రిజిస్ట్రార్లతో వాగ్వాదానికి దిగగా మరికొన్ని చోట్ల రియల్టర్లు, ప్రజలు కలిసి ఆందోళనలకు దిగారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
కర్నూల్ : మీ ఓటు ఉందా.. ఇప్పుడే చెక్ చేసుకోండి.
సాక్షి, కర్నూల్: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు : 9704738448 - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. - ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
పట్టా భూములకు రిజిస్ట్రేషన్ బంద్
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటికి తోడు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు.. ఇవన్నీ తీరాలంటే పేద రైతులు తమ పొలాలను అమ్ముకోవడమే ఏకైక మార్గం. కష్టాలో ఉన్న రైతులు అత్యవసర సమయంలో పట్టా భూములను అమ్ముకుందామంటే వారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడలో ఉన్న పట్టా భూముల రిజిస్ట్రేషన్లను కొన్ని నెలల నుంచి నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 1 నుంచి 76 వరకు ఉండగా.. కేవలం సర్వేనంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మిగతా సర్వే నంబర్లలో రైతులకు సుమారు 600 ఎకరాల పట్టా భూములుండగా.. వాటిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి భూములు మొదటి నుంచి వివాదాస్పదంగా మారడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రైతులకు వారి భూములకు సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లు కూడా అందజేశారు. అయితే కొన్నేళ్ల కిందటి నుంచి ఈ భూములకు మ్యూటేషన్‌ను కూడా నిలిపివేశారు. నకిలీ డాక్యుమెంట్ల రద్దుతో.. సర్వే నంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూములకు నకిలీ సర్వే నంబర్లు వేసి అక్రమార్కులు పత్రాలు సృష్టించారు. ఈ భూముల్లో పెద్ద ఎత్తున వెంచరు చేసి అమ్మకానికి పెట్టారు. విషయం వెలుగు చూడడంతో అధికారులు ఈ భూములకు సంబంధించిన నకిలీ పత్రాల సేల్ డీడ్లను గత అక్టోబరులో రద్దు చేశారు. ఇక్కడి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బహదూర్‌గూడలో సర్వే నంబర్లు వివాదాస్పదం కావడంతో పాటు వెబ్ పహాణీలో రైతుల వివరాలు నమోదు చేయలేదు. దీంతో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పట్టా భూములకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు. వెంచరులోని ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు.. గ్రామంలోని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు నిరాకరిస్తున్న అధికారులు ఇక్కడ వెలసిన అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జీఓ 111 పరిధిలో వెంచర్లు చేయడం నిషేధం. కానీ ఇక్కడ వెంచర్లు వేసి రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మాకు సర్వే నంబర్లు 73, 14లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. మా అన్న కూతురు పెళ్లీడుకు వచ్చింది. భూమి అమ్ముకుని పెళ్లి చేద్దామంటే రిజిస్ట్రేషన్ నిలిపి వేశారు. ఎవరూ కొనడానికి రావడం లేదు. -మల్లేష్, బహదూర్‌గూడ, శంషాబాద్. వెబ్ పహాణీలో వివరాలు లేనందుకే.. వెబ్ పహాణీలో రైతుల వివరాలు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నాం. రైతుల వద్ద పాస్‌బుక్‌లు, టైటిల్ ఉన్నా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. వెంచర్లలో గజాల చొప్పున ప్లాట్లు ఉంటాయి కాబట్టి వాటికి వెబ్ పహాణీతో సంబంధం ఉండదు. - ఎంఏ.నయీం, సబ్ రిజస్ట్రార్, శంషాబాద్. రీ సర్వే చేయాల్సి ఉంది బహదూర్‌గూడ భూములకు మొదటి నుంచి సర్వే నిర్వహించ లేదు. ఇక్కడ మొత్తం 1250 ఎకరాల భూములుండగా.. ఇందులో 650 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. మిగతావి రైతుల పట్టా భూములు. వీటికి సర్వే నిర్వహించి కొత్త సర్వే నంబర్లు ఇచ్చిన తర్వాత వెబ్ పహాణీలో నమోదు చేస్తాం. వచ్చే నెలలో భూములను సర్వే చేసేందుకు కృషిచేస్తాం. - సురేష్‌కుమార్, తహసీల్దార్, శంషాబాద్. -
పోలీసుల ఆధ్వర్యంలో వలస కార్మికుల నమోదు
రాయగడ : రాయగడ జిల్లాలోని 11 సమితుల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది గ్రామీ ణులు ఉపాధి కోసం కూలిపనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళ్తుంటా రు. కొన్ని సమయాల్లో వారు ఇతర రాష్ట్రాల్లో ప్రమాదాలకు గురి కావడం దళారుల గుప్పిట్లో నలిగిపోవడం, దోపిడీకి గురి కావడంతో పాటు సరైన వసతి, తిండి, లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆపైన ఒడిశా ప్రభుత్వం విషయం తెలుసుకుని కార్మికశాఖ ద్వారా వారిని వెతికి పట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన దళారుల ద్వారా కార్మిక శాఖలో తమపేర్లు, వివరాలు, వెళ్లే ప్రాంతం, పనిచేసే పరిశ్రమల వివరాలను నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ప్రభుత్వం నియమ నిబంధనలు ఖరారు చేసినప్పటికి ఫలితం కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం రాయగడ జిల్లా పోలీసు అధికారి రాహుల్ పీఆర్ నేతృత్వంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామపంచాయతీల ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని మొదటిసారిగా జిల్లాలోని మునిగుడ సమితిలో కొత్తగా పంచాయతీ ఏర్పాటైన గుమిటిగుడలో బుధవారం ప్రారంభించారు. జిల్లా అంతటా నమోదు కార్యక్రమంలో భాగంగా సమితి సర్పంచ్, సమితి సభ్యుల ద్వారా పంచాయతీలో ఉన్నవారి పేర్లు, వేరే రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఏఏ పరిశ్రమల్లో పనిచేస్తున్నది, ఎన్నిరోజులు వెళ్లారన్న సంపూర్ణ వివరాలు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ పీఆర్ మాట్లాడు తూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 11సమితుల్లో 181గ్రామ పంచాయతీల్లోనూ సంపూర్ణ నమో దు కార్యక్రమం పూర్తిచేసి కార్మికశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్, అడిషనల్ ఏఎస్పీ అశోక్ సాహు, ఎన్జీఓ డాని యల్, రీజనల్‌డైరెక్టర్ ఉమేజయల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చొట్రాయిడు, సర్పంచ్ మంజు ల బిడ్రిక, సమితి సభ్యులు దాలింబనాయక్, ఎస్డీపీఓ ఎ.పి.మాలిక్‌తో సహా ఇతర అధికా రులు పాల్గొన్నారు. -
‘సాక్షి స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలల వారీగా, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నాలుగు రౌండ్లలో, నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. తొలి రౌండ్లో పాఠశాలల వారీగా సెప్టెంబర్ 30వ తేదీన, వ్యక్తిగతంగా అక్టోబర్ 4వ తేదీన ప్రిలిమినరీ పోటీలు జరుగుతాయి. రెండో రౌండ్లో నవంబర్ 1వ తేదీన క్వార్టర్ ఫైనల్స్, మూడో రౌండ్లో నవంబర్ 15వ తేదీన సెమీఫైనల్స్, నాలుగో రౌండ్లో డిసెంబర్ 4వ తేదీన ఫైనల్స్ జరుగుతాయి. కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతులు; కేటగిరీ-2లో 3, 4 తరగతులు; కేటగిరీ-3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ-4లో 8, 9, 10 తరగతుల వారికి పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ. 25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ. 10 వేలతోపాటు ‘చాంపియన్ స్కూల్’ ట్రోఫీ, విజేతలకు మెడల్స్, పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. www.indiaspellbee.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 250 (ఇండియా స్పెల్స్ రిఫరెన్స్ బుక్‌తో కలిపి). ఫీజును ‘ఇండియా స్పెల్ బీ, అకౌంట్ నంబర్ 6361514081, ఇండియన్ బ్యాంక్, బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్’లో జమ చేయాలి. మరిన్ని ఇతర వివరాలకు sakshiindiaspellbee@gmail.comకు ఈమెయిల్ ద్వారా లేదా 040-23256134, 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు.