న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు సంబంధించి సెబీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీవో ఇష్యూ ముగిసిన రోజు నుంచి ఆరు పని దినాల్లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో ప్రస్తుతం లిస్ట్ కావాల్సి ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అంటే ఇకపై ఐపీవో ముగిసిన రోజు తర్వాత నుంచి మూడో పనిదినం రోజున ఆ కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 1, ఆ తర్వాత నుంచి వచ్చే ఐపీవోలకు మూడు రోజుల లిస్టింగ్ నిబంధన ఐచ్ఛికమే. అంటే ఇప్పటి మాదిరే ఆరు రోజులు (టీప్లస్6) లేదంటే మూడు రోజుల గడువు (టీప్లస్3)ను కంపెనీలు అనుసరించొచ్చు. కానీ, డిసెంబర్ 1 నుంచి మాత్రం విధిగా అన్ని ఐపీవోలు మూడు రోజుల లిస్టింగ్ నిబంధననే అమలు చేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అందరికీ అనుకూలమే
సెబీ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. షేర్ల కేటాయింపు లేకపోతే బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ అయిన నిధులు తొందరగా విడుదల అవుతాయి. రుణం తీసుకుని ఐపీవోల్లో దరఖాస్తు చేసే హెచ్‌ఎన్‌ఐలు కూడా ఉంటారు. వీరికి రోజుల వారీగా రుణంపై వడ్డీ భారం పడుతుంది.
తొందరగా లిస్ట్ అయితే, తాము తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేసే వీలుంటుంది. అటు ఐపీవోకు వచ్చిన కంపెనీలకూ ప్రయోజనమే. ఎలా అంటే ఐపీవో నిధులను అవి వేగంగా పొందొచ్చు. ఏఎస్‌బీఏ కింద షేర్లు అలాట్ కాని వారి నిధులను బ్యాంకు ఖాతాల్లో టీప్లస్3 రోజున అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి చెల్లించే పరిహారం అనేది ట్లీప్లస్3 తర్వాతి రోజు నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment