ముంబై, సాక్షి: భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల వినియోగానికి సన్నాహలు చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యూఎస్ దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్‌కు యూకే, బెహ్రయిన్, కెనడా అనుమతించగా.. తాజాగా యూఎస్ అదే బాట పట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక దేశీయంగానూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ తదితర కంపెనీలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతుల సన్నాహాల్లో ఉన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిలవగా.. ఐసీఎంఆర్ సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!)
ఎంవోయూ
కోవిడ్-19 కట్టడికి వినియోగించనున్న వ్యాక్సిన్ల సరఫరా, పంపిణీలకు వీలుగా గురువారం దేశీ కంపెనీలు స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తద్వారా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వ్యాక్సిన్ల సరఫరాకు శీతలీకరణ సౌకర్యాలతో కూడిన ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులు అందించనుంది. వీటికి జతగా లాజిస్టిక్స్ కంపెనీ స్నోమ్యాన్ భూమిమీద శీతల గిడ్డంగులు, ప్యాకింగ్, స్టోరేజీ, పంపిణీ తదితర సేవలు అందించనుంది. వెరసి ఎండ్‌టు ఎండ్ సర్వీసులు అందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ షేర్లు బలపడిన విషయం విదితమే. ఈ బాటలో మరోసారి స్పైస్‌జెట్ షేరు 3 శాతం పుంజుకుని రూ. 103కు చేరగా.. తాజాగా లాజిస్టిక్స్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. పలు కౌంటర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. (దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి)
షేర్ల జోరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నవకార్ కార్పొరేషన్ 10 శాతం దూసుకెళ్లి రూ. 42.95కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఆల్‌కార్గో లాజిస్టిక్స్ 4 శాతం ఎగసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 155 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వరుసగా రెండో రోజు స్నోమ్యాన్ లాజిస్టిక్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 65 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 70 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో మహీంద్రా లాజిస్టిక్స్ 5 శాతం పెరిగి రూ. 410 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 428 వరకూ ఎగసింది. ఇదేవిధంగా సికాల్ లాజిస్టిక్స్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.30 వద్ద, పటేల్ ఇంటిగ్రేటెడ్ 10 శాతం వృద్ధితో రూ. 31.25 వద్ద ఫ్రీజయ్యాయి. ఇతర కౌంటర్లలో గతి, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ సైతం ప్రస్తావించదగ్గ లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment