జీరో కార్బన్ ఎమిషన్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం. కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్క్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది. డీజిల్, పెట్రోల్ బండ్లతో రోడ్ల మీదకి వస్తే భారీ ఫైన్లు విధిస్తున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు.
ప్రత్యేక పన్ను
ప్రపంచలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా లండన్‌కి పేరు. అయితే ఈ నగరంలో కొన్ని ప్రాంతాలను అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. ఈ నిబంధన ఉల్లంఘించి ఏదైనా వాహనం ఈ మార్గంలో ప్రయాణిస్తే వాటికి ప్రత్యేక పన్నుగా 12.5 పౌండ్లు విధిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ పన్ను దాదాపు రూ. 1200లుగా ఉంది.
ఈ ఇంజన్లయితే ఓకే
లండన్ నగరంలోని అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు పెట్రోలు వాహానాలైతే యూరో స్టేజ్ 4 ప్రమాణాలు పాటించాలని డీజిల్ వాహానాలైతే యూరో స్టేజ్ 6 ప్రమాణాలు పాటించాలని నిర్ధేశించాయి.
ముక్కుపిండి
యూరో స్టేజ్ 4, 6 ప్రమాణాల ప్రకారం తయారైన వాహనాలు కాకుండా పాత పెట్రోలు, డీజిల్ ఇంజన్‌తో నడిచే వాహనాలతో ఈ జోన్లలోని రోడ్లపైకి వస్తే 12.5 పౌండ్ల ప్రత్యేక పన్నుని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
మిగిలిన నగరాలకు
కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే టార్గెట్‌తో మొదట బైకులు, స్కూటర్లపై ఈ ప్రత్యేక పన్ను విధించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు ఇతర వాహనాలకు విస్తరించారు. బెటర్ రిజల్ట్స్ వస్తే ఈ విధానాన్ని దేశంలోని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలనే యోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.
బాదేస్తున్నారు
ఈ ప్రత్యేక పన్నుపై లండన్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఇంట్లో నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత రకరకాల పనుల నిమిత్తం తిరగాల్సి ఉంటుందని, ఒక్కొసారి ట్రాఫిక్ జామ్స్ వల్ల ఆల్టర్నేట్ రూట్స్‌లో వెళ్తుంటామని, ఇలాంటి సమయంలో అల్ట్రా లో ఎమిషన్ జోన్‌లోకి వచ్చారంటూ ఈ ప్రత్యేక పన్ను విధించడం బాగాలేదని కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కాలుష్యం తగ్గించాలంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు.
చదవండి : ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి హోండా మోటార్స్
Comments
Please login to add a commentAdd a comment