భారీ అమ్మకాలపై కంపెనీల ఆశలు
పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్‌లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి.
కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది.
రెండంకెల స్థాయిలో వృద్ధి..
సాధారణంగా ఈ సీజన్‌లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు.
కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్‌లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం..
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్‌కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment