BMW Group India
-
10,000 మార్కుకు బీఎండబ్ల్యూ–మినీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు దేశీయంగా 10,000 యూనిట్ల మార్కును తొలిసారిగా దాటాయి. గతేడాదితో పోలిస్తే 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో 10,056 బీఎండబ్ల్యూ, 500 యూనిట్లు మినీ బ్రాండ్‌లో విక్రయించింది. 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రెండు బ్రాండ్లలో కలిపి మొత్తం 9,580 యూనిట్లు రోడ్డెక్కాయి. మోటరాడ్ బ్రాండ్‌లో 5,638 యూనిట్ల మోటార్‌సైకిల్స్ సైతం అమ్ముడయ్యాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా తెలిపారు. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లలో ఈ ఏడాది 725 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగుతీస్తున్నాయని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ల రంగంలో 2,000 యూనిట్ల ఈవీల అమ్మకాల మార్కును దాటిన తొలి కంపెనీగా స్థానం సంపాదించామన్నారు. బీఎండబ్ల్యూ భారత్‌లో శుక్రవారం ఎం4 సీఎస్ లగ్జరీ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.89 కోట్లు. -
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. ఎస్‌డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఎన్నడూలేని విధంగా 2021లో రికార్డుస్థాయిలో వాహనాల అమ్మకాలను జరిపినట్లు బీఎండబ్ల్యూ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీగా పెరిగిన అమ్మకాలు..! 2021 భారత్‌లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. మినీ కూపర్స్ కూడా అధికమే..! బీఎండబ్ల్యూ వాహనాల్లో మినీ కూపర్స్ కూడా భారత్‌లో అత్యధిక ఆదరణను నోచుకున్నాయి. 2021లో 640 యూనిట్ల మినీ కూపర్ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5 వాహనాలు భారీగా అమ్ముడైనాయి. వీటితో పాటుగా బీఎండబ్ల్యూ ఎమ్ 340ఐ ఎక్స్డిజైర్, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ 3 సిరీస్ వాహనాల కోసం కొనుగోలుదారులు నెలల తరబడి వేచి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
టీవీఎస్ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్.. తమిళనాడులోని హొసూర్ ప్లాంటులో ఒక లక్ష బీఎండబ్ల్యూ మోటరాడ్ 310 సీసీ బైక్స్‌ను ఉత్పత్తి చేసింది. అయిదేళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటరాడ్స్ బైక్స్ ఉత్పత్తిలో హొసూర్ ప్లాంటు వాటా 10 శాతం ఉంది. 2013లో ఇరు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్ కోసం 500 సీసీ లోపు సామర్థ్యంగల బైక్స్ అభివృద్ధి, తయారీని టీవీఎస్ చేపట్టింది. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ జి310 ఆర్, 310 జీఎస్, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్స్‌ను ఇరు సంస్థలు పరిచయం చేశాయి. ఈ మూడు బైక్స్ కూడా హొసూర్‌లో తయారవుతున్నాయి. బీఎండబ్లు్య జి310 ఆర్, 310 జీఎస్ మోడళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో లభ్యమవుతున్నాయి. -
బీఎండబ్ల్యూ సి–400 జీటీ స్కూటర్
ద్విచక్ర వాహన రంగంలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత్‌లో సి–400 జీటీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.95 లక్షలు. పూర్తిగా తయారైన స్కూటర్‌ను కంపెనీ భారత్‌కు దిగుమతి చేస్తోంది. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. నగరంతోపాటు సుదూర ప్రాంతాలనూ ఈ స్కూటర్‌పై సులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 34 హెచ్‌పీ పవర్‌తో వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 350 సీసీ ఇంజన్‌ను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. గంటకు 139 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. చదవండి : పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్ -
నంబర్ చెప్పను.. కానీ ముందుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: తమ వాహనాల విక్రయాల్లో భారత మార్కెట్ లో ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధి సాధిస్తామని లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా విశ్వాసం వ్యక్తం చేశారు. లగ్జరీ కార్ల మార్కెట్ లో వినియోగదారులకు కొత్త విలువను అందించేడమే తమ లక్ష్యమని చెప్పారు. భారత్ మార్కెట్లో తమకు తెలుగు రాష్ట్రాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మోడల్స్ ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. స్పోర్ట్స్ వినియోగ వాహనం(ఎస్ వీయూ) ఎక్స్ 3 మోడల్ లో రెండు కొత్త వెర్షన్లను ఆయన గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఢిల్లీ గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన బిఎండబ్ల్యూ 45వ షోరూమ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విక్రమ్ పావాతో 'సాక్షి' ప్రతినిధితో జరిపిన ఇంటర్వ్యూ.. భారత్ లగ్జరీ కార్ల మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎదుగుదల ఏవిధంగా ఉంది? 2007లో మేము భారత లగ్జరీ మార్కెట్ లోకి అడుగుపెట్టాం. అప్పటికి విలాస కార్ల అమ్మకాలు కేవలం 2 వేల యూనిట్లు మాత్రమే. ప్రస్తుతం ఈ సంఖ్య 37 వేలకు చేరింది. అగ్రదేశాల మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్ తో పోల్చుకుంటే ఇండియాలో ఇప్పటికీ లగ్జరీ కార్ల మార్కెట్ 1.2 నుంచి 1.4 శాతమే ఉంది. చైనాలో 10 శాతం, జర్మనీలో 28 శాతం వరకు విలాసవంతమైన కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉన్నాం. గతేడాది మీ అమ్మకాల్లో 24 శాతం వృద్ది సాధించమన్నారు. ఈ సంవత్సరంలో ఎంత వృద్ధి నమోదవుతుంది ఆశిస్తున్నారు? నంబర్ కచ్చితంగా చెప్పలేను. గతేడాది కంటే అమ్మకాలు మెరుగవుతాయి. నిరుడి కంటే ఎక్కువ శాతం వృద్ధి నమోదు చేస్తాం. మార్కెట్లో మా వాటాను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మార్కెట్ గమనం ఎలా ఉంటుందనేది ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ప్రకటించే హమీలు మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. గతంలో లగ్జరీ కార్ల మార్కెట్ లో బీఎండబ్ల్యూ నంబర్‌వన్‌లో ఉండేది. మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారా? నంబర్‌వన్ కంటే కూడా మార్కెట్లో ఎదగడం ముఖ్యం. అగ్రస్థానంలో కొనసాగడమనేది గొప్ప విషయం. అమ్మకాల్లో వృద్ది స్థిరంగా ఉంటే నంబర్‌వన్ అవుతాం. మా అమ్మకాలు మరింతగా పెంచుకుని నంబర్‌వన్ అవుతామన్న నమ్మకం ఉంది. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవాలన్నదే మా ప్రధాన లక్ష్యం. వినియోగదారులకు కొత్త విలువ(న్యూ వాల్యు) అందించేందుకు నిరంతరంప్రయత్నిస్తున్నాం. చిన్న పట్టణాల్లో మార్కెట్ విస్తరణపై ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు? లగ్జరీ కార్ల అమ్మకాలు చిన్న పట్టణాల్లోనూ ఆశాజనకంగా ఉన్నాయి. మెట్రో నగరాలతో పాటు పోలిస్తే అమ్మకాలు తక్కువగా జరుతున్నప్పటీకీ ఇక్కడ మార్కెట్ ను విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు కూడా విలాసవంతమైన కార్లను కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. గతేడాది మధురై షోరూమ్ ప్రారంభించినప్పడు మంచి స్పందన వచ్చింది. అంతకుముందు ఔరంగాబాద్‌లో షోరూమ్ ఏర్పాటు చేశాం. వచ్చే ఏడాది మార్చినాటికి 50 షోరూమ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భారత మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టే ఉద్దేశం ఉందా? ప్రపంచ మార్కెట్ లో మేము ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాము. అయితే భారత మార్కెట్ లో వీటిని ప్రవేశపెట్టడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం సదుపాయాలు కల్పించి, రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తాం. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వీటి నిర్వహణ, చార్జింగ్ ధరలు మొదలైన అంశాలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్‌లో ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆ రంగంలో అనుభవం లేదు కాబట్టి ఇందులో మేము భాగస్వాములం కాలేము. ఈ సంవత్సరంలో ఎన్ని మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారు? నంబరు చెప్పలేను. ఎన్ని మోడల్స్ వస్తాయనేది కస్టమర్ల డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. మా కార్లను కొనేందుకు వినియోగదారులు ఎంత ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తే అన్ని కొత్త మోడల్స్ వస్తాయి. ఆటో ఎక్స్‌పోలో ఏడు మోడల్స్ ప్రదర్శించాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్స్ 3 పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్ లోకి విడుదల చేస్తాం. తాజాగా ప్రవేశపెట్టిన డీజిల్ వెరియంట్స్‌లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం. లేటెస్ట్ టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన విడిభాగాలతో రూపొందించిన ఎక్స్ 3 మోడల్స్ కస్టమర్లకు అన్నివిధాలా నచ్చుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అమ్మకాలు పెంచుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రపంచమంతా పాటిస్తున్న ప్రణాళికలే ఇక్కడా అమలు చేస్తాం. భారత్ మార్కెట్లో తెలుగు రాష్ట్రాలు మాకు కీలకమని చెప్పగలను. హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో మాకు షోరూమ్‌లు ఉన్నాయి. ఇటీవల గుంటూరులో మేము ప్రారంభించిన మొబైల్ స్టూడియోలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 50 నగరాలను మొబైల్ స్టూడియోలు కవర్ చేశాయి. వారంలో మూడునాలుగు రోజుల పాటు మొబైల్ స్టూడియోల ద్వారా సేవలు అందిస్తున్నాం. కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్‌తో పాటు ఇతర సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు బ్రాండ్ ఎక్స్ పీరియన్స్ అందించాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేశాం. మొబైల్ స్టూడియోలకు అపూర్వ స్పందన వస్తోంది. మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరిస్తాం. -
బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7
గుర్గావ్: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ బుధవారం అంతా కొత్తదైన బీఎండబ్ల్యూ యాక్టివ్‌హైబ్రిడ్ 7 సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.1.35 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). బీఎండబ్ల్యూ భారత్‌లో అందిస్తున్న తొలి హైబ్రిడ్ కారు ఇది. ఈ కారు విక్రయాలను బుధవారం నుంచే ప్రారంభిస్తున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సాహా చెప్పారు. పెట్రోల్, లిథియం అయాన్ బ్యాటరీతోనూ(ఎలక్ట్రిక్)నడిచే ఈ హైబ్రిడ్ కారును సౌకర్యం, స్పేస్‌లలో ఎలాంటి రాజీ పడకుండా అందిస్తున్నామని వివరించారు. ముందు వరుస సీట్లలో ఫోల్డింగ్ టేబుల్స్, వెనక సీట్లలో మస్సాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఎం3 సెడాన్, ఎం4 కూపే, ఎం5 సెడాన్, ఐ8 కార్లను అందించనున్నట్లుచెప్పారు. కారు ప్రత్యేకతలు...: 0-100కిమీ వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే ఈ కారు గరిష్ట వేగం 250 కిమీ/గం. కీ లెస్ ఎంట్రీ, పార్కింగ్ సెన్సర్లు, ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్-వ్యూ కెమెరా, నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ రేడియోతో కూడిన 10 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
మేడిన్ ఇండియా బీఎండబ్ల్యూ ఎస్యూవీ..
పుణే: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ పూర్తిగా భారత్‌లోనే తయారైన ఎస్యూవీను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్ 30డి మోడల్ ధర రూ.70.9 లక్షలని (ఎక్స్ షోరూమ్) బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సర్ చెప్పారు. ఈ థర్డ్ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యూవీని ప్రముఖ క్రికెటర్, బీఎండబ్ల్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఫస్ట్ జనరేషన్ ఎక్స్ 5ను 2002 నుంచి వాడుతున్నానని ఈ సందర్భంగా సచిన్ చెప్పారు. ఈ మోడల్‌ను చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నామని, అందుకని గతంలో కంటే ధర రూ. 10 లక్షలు తగ్గిందని ఫిలిప్ వాన్ చెప్పారు. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 38 మంది డీలర్ల ద్వారా విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకతలు... ఈ ఎస్‌యూవీలో ఐడ్రైవ్ సిస్టమ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ముందు సీట్లను, స్టీరింగ్‌ను ఎలక్ట్రానిక్ విధానంలో అడ్జెస్ట్ చేసుకునే వీలు, 8 గేర్లు(ఆటోమాటిక్) వంటి ప్రత్యేకతలున్నాయి. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.9 సెకన్లలో అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఈ కారు 15.3 కిలీమీటర్ల మైలేజీని స్తుందని కంపెనీ అంటోంది. ఏడు సీట్ల ఈ కారు మెర్సిడెస్ ఎంఎల్-క్లాస్ ఎస్‌యూవీకి గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరో 6-8 మోడళ్లు ఎక్స్5 ఎస్యూవీను 1999లో మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలు విక్రయించామని ఫిలిప్ వాన్ వివరించారు. సౌకర్యం, స్థలం, డ్రైవింగ్, మైలేజీ, ఫీచర్లు.. ఇలా ఏ అంశంలో చూసినా ఈ తాజా మోడల్ అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తెచ్చిన మూడో కారు ఇది. ఇంతకు ముందు ఎం6-గ్రాండ్ కూపే, 3 సిరీస్ జీటీ మోడళ్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఏడాది మరో 6-8 మోడళ్లను అందించనున్నామని, ఎం3 సెడాన్, ఎం4 కూపే, ఎం5 సెడాన్లు వాటిల్లో ఉన్నాయని ఫిలిప్ పేర్కొన్నారు. ప్రస్తుతం 38గా ఉన్న డీలర్ల సంఖ్యను వచ్చే ఏడాది చివరికల్లా 50కు పెంచనున్నామని వివరించారు. 6 సిరీస్ గ్రాన్ కూపే, ఎక్స్6, జడ్4, ఎం6 గ్రాన్ కూపే తదితర మోడళ్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తామని పేర్కొన్నారు. బీఎం డబ్ల్యూ గ్రూప్ భారత్‌లో మూడు బ్రాండ్లు- బీఎండబ్ల్యూ, మిని, రోల్స్ రాయిస్ కార్లను విక్రయిస్తోంది. ఇప్పటిదాకా చెన్నైలో రూ.390 కోట్లు పెట్టుబడులు పెట్టింది. -
బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్ల ధరలనూ పెంచనుంది. మినీ మోడల్‌తో సహా అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 5 శాతం వరకూ పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ధరలను పెంచాలని నిర్ణయించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించలేదు. అయితే రూపాయి పతనం కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగిపోతుండటంతో కంపెనీ ధరలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కంపెనీ భారత్‌లో బీఎండబ్ల్యూ 3, 5, 6, 7 సిరీస్, ఎస్యూవీ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, స్పోర్ట్స్ కార్ ఎ సిరీస్ వంటి కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.28.6 లక్షల నుంచి రూ.1.73 కోట్ల రేంజ్లో ఉన్నాయి. కాగా రూపాయి పతనం కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయి. మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడి గత నెల 15 నుంచే ధరలను 4 శాతం పెంచింది.