మేడిన్ ఇండియా బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ.. | New BMW X5 launched in India at Rs 70.9 lakh | Sakshi
Sakshi News home page

మేడిన్ ఇండియా బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ..

Published Fri, May 30 2014 2:48 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

మేడిన్ ఇండియా బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ.. - Sakshi

మేడిన్ ఇండియా బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ..

 పుణే: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ పూర్తిగా భారత్‌లోనే తయారైన ఎస్‌యూవీను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్ 30డి మోడల్ ధర రూ.70.9 లక్షలని (ఎక్స్ షోరూమ్)  బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సర్ చెప్పారు. ఈ థర్డ్ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యూవీని ప్రముఖ క్రికెటర్, బీఎండబ్ల్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఫస్ట్ జనరేషన్ ఎక్స్ 5ను 2002 నుంచి వాడుతున్నానని ఈ సందర్భంగా సచిన్ చెప్పారు. ఈ మోడల్‌ను చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నామని, అందుకని గతంలో కంటే ధర రూ. 10 లక్షలు తగ్గిందని ఫిలిప్ వాన్ చెప్పారు. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 38 మంది డీలర్ల ద్వారా విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

 ప్రత్యేకతలు...
 ఈ ఎస్‌యూవీలో ఐడ్రైవ్ సిస్టమ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ముందు సీట్లను, స్టీరింగ్‌ను ఎలక్ట్రానిక్ విధానంలో అడ్జెస్ట్ చేసుకునే వీలు, 8 గేర్లు(ఆటోమాటిక్) వంటి ప్రత్యేకతలున్నాయి. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.9 సెకన్లలో అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఈ కారు 15.3 కిలీమీటర్ల మైలేజీని స్తుందని కంపెనీ అంటోంది. ఏడు సీట్ల ఈ కారు మెర్సిడెస్ ఎంఎల్-క్లాస్ ఎస్‌యూవీకి గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

 మరో 6-8 మోడళ్లు
 ఎక్స్5 ఎస్‌యూవీను 1999లో మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలు విక్రయించామని ఫిలిప్ వాన్ వివరించారు. సౌకర్యం, స్థలం, డ్రైవింగ్, మైలేజీ,  ఫీచర్లు.. ఇలా ఏ అంశంలో చూసినా ఈ తాజా మోడల్ అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తెచ్చిన మూడో కారు ఇది. ఇంతకు ముందు ఎం6-గ్రాండ్ కూపే, 3 సిరీస్ జీటీ మోడళ్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఏడాది మరో 6-8 మోడళ్లను అందించనున్నామని, ఎం3 సెడాన్, ఎం4 కూపే, ఎం5 సెడాన్‌లు వాటిల్లో ఉన్నాయని  ఫిలిప్ పేర్కొన్నారు. ప్రస్తుతం 38గా ఉన్న డీలర్ల సంఖ్యను వచ్చే ఏడాది చివరికల్లా 50కు పెంచనున్నామని వివరించారు. 6 సిరీస్ గ్రాన్ కూపే, ఎక్స్6, జడ్4, ఎం6 గ్రాన్ కూపే తదితర మోడళ్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తామని పేర్కొన్నారు. బీఎం డబ్ల్యూ గ్రూప్ భారత్‌లో మూడు బ్రాండ్లు- బీఎండబ్ల్యూ, మిని, రోల్స్ రాయిస్ కార్లను విక్రయిస్తోంది. ఇప్పటిదాకా చెన్నైలో రూ.390 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement