నంబర్‌ చెప్పను.. కానీ ముందుంటాం | Vikram Pawah Exclusive Interview By Sakshi | Sakshi
Sakshi News home page

నంబర్‌ చెప్పను.. కానీ ముందుంటాం

Published Fri, Apr 20 2018 4:02 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

Vikram Pawah Exclusive Interview By Sakshi

విక్రమ్ పావా

సాక్షి, న్యూఢిల్లీ: తమ వాహనాల విక్రయాల్లో భారత మార్కెట్ లో ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధి సాధిస్తామని లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా విశ్వాసం వ్యక్తం చేశారు. లగ్జరీ కార్ల మార్కెట్ లో వినియోగదారులకు కొత్త విలువను అందించేడమే తమ లక్ష్యమని చెప్పారు. భారత్‌ మార్కెట్‌లో తమకు తెలుగు రాష్ట్రాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. స్పోర్ట్స్ వినియోగ వాహనం(ఎస్ వీయూ) ఎక్స్ 3 మోడల్ లో రెండు కొత్త వెర్షన్లను ఆయన గురువారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఢిల్లీ గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన బిఎండబ్ల్యూ 45వ షోరూమ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విక్రమ్ పావాతో 'సాక్షి' ప్రతినిధితో జరిపిన ఇంటర్వ్యూ..

భారత్ లగ్జరీ కార్ల మార్కెట్‌లో బీఎండబ్ల్యూ ఎదుగుదల ఏవిధంగా ఉంది?
2007లో మేము భారత లగ్జరీ మార్కెట్ లోకి అడుగుపెట్టాం. అప్పటికి విలాస కార్ల అమ్మకాలు కేవలం 2 వేల యూనిట్లు మాత్రమే. ప్రస్తుతం ఈ సంఖ్య 37 వేలకు చేరింది. అగ్రదేశాల మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్ తో పోల్చుకుంటే ఇండియాలో ఇప్పటికీ లగ్జరీ కార్ల మార్కెట్ 1.2 నుంచి 1.4 శాతమే ఉంది. చైనాలో 10 శాతం, జర్మనీలో 28 శాతం వరకు విలాసవంతమైన కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉన్నాం.

గతేడాది మీ అమ్మకాల్లో 24 శాతం వృద్ది సాధించమన్నారు. ఈ సంవత్సరంలో ఎంత వృద్ధి నమోదవుతుంది ఆశిస్తున్నారు?
నంబర్ కచ్చితంగా చెప్పలేను. గతేడాది కంటే అమ్మకాలు మెరుగవుతాయి. నిరుడి కంటే ఎక్కువ శాతం వృద్ధి నమోదు చేస్తాం. మార్కెట్‌లో మా వాటాను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మార్కెట్ గమనం ఎలా ఉంటుందనేది ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ప్రకటించే హమీలు మార్కెట్ పై ప్రభావం చూపుతాయి.

గతంలో లగ్జరీ కార్ల మార్కెట్ లో బీఎండబ్ల్యూ నంబర్‌వన్‌లో ఉండేది. మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారా?
నంబర్‌వన్ కంటే కూడా మార్కెట్‌లో ఎదగడం ముఖ్యం. అగ్రస్థానంలో కొనసాగడమనేది గొప్ప విషయం. అమ్మకాల్లో వృద్ది స్థిరంగా ఉంటే నంబర్‌వన్ అవుతాం. మా అమ్మకాలు మరింతగా పెంచుకుని నంబర్‌వన్ అవుతామన్న నమ్మకం ఉంది. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవాలన్నదే మా ప్రధాన లక్ష్యం. వినియోగదారులకు కొత్త విలువ(న్యూ వాల్యు) అందించేందుకు నిరంతరంప్రయత్నిస్తున్నాం.

చిన్న పట్టణాల్లో మార్కెట్ విస్తరణపై ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు?
లగ్జరీ కార్ల అమ్మకాలు చిన్న పట్టణాల్లోనూ ఆశాజనకంగా ఉన్నాయి. మెట్రో నగరాలతో పాటు పోలిస్తే అమ్మకాలు తక్కువగా జరుతున్నప్పటీకీ ఇక్కడ మార్కెట్ ను విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు కూడా విలాసవంతమైన కార్లను కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. గతేడాది మధురై షోరూమ్ ప్రారంభించినప్పడు మంచి స్పందన వచ్చింది. అంతకుముందు ఔరంగాబాద్‌లో షోరూమ్ ఏర్పాటు చేశాం. వచ్చే ఏడాది మార్చినాటికి 50 షోరూమ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

భారత మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టే ఉద్దేశం ఉందా?
ప్రపంచ మార్కెట్ లో మేము ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాము. అయితే భారత మార్కెట్ లో వీటిని ప్రవేశపెట్టడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం సదుపాయాలు కల్పించి, రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తాం. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వీటి నిర్వహణ, చార్జింగ్ ధరలు మొదలైన  అంశాలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్‌లో ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆ రంగంలో అనుభవం లేదు కాబట్టి ఇందులో మేము భాగస్వాములం కాలేము.

ఈ సంవత్సరంలో ఎన్ని మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారు?
నంబరు  చెప్పలేను. ఎన్ని మోడల్స్ వస్తాయనేది కస్టమర్ల డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. మా కార్లను కొనేందుకు వినియోగదారులు ఎంత ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తే అన్ని కొత్త మోడల్స్ వస్తాయి. ఆటో ఎక్స్‌పోలో ఏడు మోడల్స్ ప్రదర్శించాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్స్ 3 పెట్రోల్‌ వేరియంట్‌ను మార్కెట్ లోకి విడుదల చేస్తాం. తాజాగా ప్రవేశపెట్టిన డీజిల్‌ వెరియంట్స్‌లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం. లేటెస్ట్‌ టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన విడిభాగాలతో రూపొందించిన ఎక్స్‌ 3 మోడల్స్‌ కస్టమర్లకు అన్నివిధాలా నచ్చుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అమ్మకాలు పెంచుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా?
ప్రపంచమంతా పాటిస్తున్న ప్రణాళికలే ఇక్కడా అమలు చేస్తాం. భారత్‌ మార్కెట్‌లో తెలుగు రాష్ట్రాలు మాకు కీలకమని చెప్పగలను. హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో మాకు షోరూమ్‌లు ఉన్నాయి. ఇటీవల గుంటూరులో మేము ప్రారంభించిన మొబైల్ స్టూడియోలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 50 నగరాలను మొబైల్ స్టూడియోలు కవర్‌ చేశాయి. వారంలో మూడునాలుగు రోజుల పాటు మొబైల్ స్టూడియోల ద్వారా సేవలు అందిస్తున్నాం. కస్టమర్లకు టెస్ట్‌ డ్రైవ్‌, సర్వీసింగ్‌తో పాటు ఇతర సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు బ్రాండ్ ఎక్స్ పీరియన్స్ అందించాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేశాం. మొబైల్ స్టూడియోలకు అపూర్వ స్పందన వస్తోంది. మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement