పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్
♦ గోపిచంద్ గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు: సచిన్
♦ పీవీసింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, గోపిచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్ల బహుమానం
♦ ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ 'రియల్ హీరో' అంటూ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్.. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ సింధు, గోపిచంద్, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు.
అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే మెడల్స్ సాధించగలిగారని ప్రశంసించారు. వీరిని చూసి భారత్ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మరిన్ని మెడల్స్ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్, గోపిచంద్‌లకు సచిన్ కారు తాళాలు అందజేశారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్ వైస్ ప్రెసెడెంట్ చాముండేశ్వరినాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రజత పతకం సాధించిన తెలుగు అమ్మాయి, షెట్లర్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒలింపిక్ మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరెన్నీ పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో వచ్చినా.. ఇంత ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది.