Deepa karmakar
-
డోపింగ్‌లో పట్టుబడ్డ దీపా కర్మాకర్‌పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది. అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది. -
దీపా కర్మాకర్‌కు గాయం
బాకు (అజర్బైజాన్ ): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అర్హత పొందే అవకాశాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లలో భాగమైన ప్రపంచకప్‌లో దీపా వాల్ట్ విభాగం ఫైనల్లో విఫలమైంది. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఆమె ఫైనల్లో నిర్ణీత రెండు అవకాశాలను పూర్తి చేయలేకపోయింది. తొలి అవకాశంలో దీపా 13.133 పాయింట్లు స్కోరు చేసింది. అదే సమయంలో ఆమెకు గాయం కావడంతో రెండో రొటేషన్‌ను ప్రయత్నించలేదు. ఫలితంగా ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే వారం దోహాలో జరిగే ప్రపంచకప్ టోర్నీ నుంచి దీపా వైదొలిగింది. ‘ఫైనల్‌కు ముందే దీపా మోకాలి నొప్పితో బాధపడింది. ఫిజియో సాయంతో ఆమె ఫైనల్లో పాల్గొన్నా తొలి ప్రయత్నంలో ఆమె మ్యాట్‌పై సరిగ్గా ల్యాండ్ కాలేదు. దాంతో గాయం తిరగబెట్టింది. గాయం నుంచి కోలుకున్నాక దీపా జూన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో, అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది’ అని భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు రియాజ్ భాటి తెలిపారు. -
చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పసిడి పతకంతో సత్తా చాటింది. టర్కీ లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో దీపా వాల్ట్ ఈవెంట్లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్ ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదే తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం సాధించింది. -
ఫోర్బ్స్ ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో దీప, సాక్షి
న్యూయార్క్: రియో ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో యావత్ భారతావని మనసులను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌లకు అంతర్జాతీయస్థాయి గౌరవం లభించింది. ప్రముఖ మేగజైన్ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు తమ తమ రంగాల్లో రాణించి గొప్ప విప్లవాత్మక మార్పులకు కారణమైన 300 మంది యంగ్ అచీవర్స్‌తో ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను రూపొందించింది. భారత్ నుంచి మొత్తం 53 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. ‘రియోలో దీపా పతకం గెలవకపోయినా... కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన ప్రోడునోవా విన్యాసాన్ని విజయవంతంగా చేసింది’ అని ఫోర్బ్స్ పత్రిక ప్రశంసించింది. మరోవైపు ఎన్నో ప్రతికూలతలను అధిగమించి సాక్షి మలిక్ మహిళల రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఫోర్బ్స్ పత్రిక కొనియాడింది. దీపా, సాక్షిలతోపాటు ఈ జాబితాలో భారత తొలి పారాలింపిక్ స్విమ్మర్ శరత్ గైక్వాడ్‌కూ స్థానం లభించింది. కేవలం ఒక చేయి సహకారంతో స్విమ్మింగ్ చేసే శరత్ ఇప్పటివరకు పలు ఈవెంట్లలో 96 పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. -
సాక్షి, దీప మరో ఘనత
న్యూఢిల్లీ: ఫోర్బ్ష్ సూపర్ ఎచీవర్స్ జాబితా-2017లో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, నటి అలియా భట్ చోటు దక్కించుకున్నారు. ఆసియా ఖండంలో 30 ఏళ్లలోపు విజేతలతో ఈ జాబితా తయారు చేసింది. 10 విభాగాలకు చెందిన 300 మంది యువ విజేతల పేర్లను ఇందులో పొందుపరిచింది. వినోదం, వాణిజ్యం, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సామాజిక వాణిజ్యం, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ తదితర రంగాల్లో విజేతలుగా నిలిచిన 30 ఏళ్లలోపు వారిని ఈ జాబితాలో చేర్చింది. భారత్ నుంచి 53 మంది విజేతలకు చోటు దక్కింది. చైనా(76) మనకంటే ముందుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సోదరులు సంజయ్(15), శ్రావణ్ కుమరన్(17) పిన్నయవస్కులుగా నిలిచారు. ఐదేళ్ల క్రితం వీరిద్దరూ గో డైమన్షన్స్ పేరుతో మొబైల్ యాప్ అభివృద్ధి సంస్థను స్థాపించారు. 0.15 పాయింట్లతో పతకం కోల్పోయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని దీపా కర్మాకర్ ను ఫోర్బ్స్ ప్రశంసించింది. రియో ఒలింపిక్స్ లో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ లోని రొహతక్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన సాక్షి మాలిక్ స్థానిక అవాంతరాలను అధిగమించి రెజ్లింగ్ లో ఒలింపిక్ పతకం సాధించిందని ఫోర్బ్స్ మెచ్చుకుంది. -
ప్రతిభకు ‘పద్మా’భిషేకం
న్యూఢిల్లీ: చేసింది. సంచలన క్రికెటర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించింది. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా మలిక్‌తో పాటు శేఖర్ నాయక్, వికాస్ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్ ఉన్నారు. కోహ్లి (క్రికెట్): సంచలనాల క్రికెటర్ విరాట్ కోహ్లి. ఇంటాబయటా... వేదికేదైనా... ఫార్మాట్ ఏదైనా పరుగుల వేటగాడు మాత్రం అతడే. ఛేదనలో కొండంత లక్ష్యాన్ని సైతం పిండిచేయగల ఈ ‘రన్ మెషిన్’ ఇప్పుడు టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సాక్షి (రెజ్లింగ్): రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్. హరియాణాకు చెందిన సాక్షి 58 కేజీల బౌట్లో తన అద్వితీయ ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది. వికాస్ గౌడ (అథ్లెటిక్స్): కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో డిస్కస్ త్రో చాంపియన్ వికాస్. కర్ణాటకకు చెందిన వికాస్ రెండు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు. మరియప్పన్ తంగవేలు (పారాథ్లెటిక్స్): ఈ పారాలింపియన్ ప్రతిభకు వైకల్యమే చిన్నబోయింది. తమిళనాడుకు చెందిన తంగవేలు రియో పారాలింపిక్స్‌లో హైజంప్ టి42 కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. దీపా మలిక్ (పారాథ్లెటిక్స్): హరియాణాకు చెందిన దీపా మలిక్ రియో పారాలింపిక్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో అచ్చెరువొందించే ప్రదర్శనతో రజత పతకం గెలిచింది. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్): ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ రియోలో తృటిలో పతకం కోల్పోయింది. త్రిపురకు చెందిన ఈ మెరుపుతీగ వాల్టింగ్ ఈవెంట్లో తన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి భారత అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. శ్రీజేశ్ (హాకీ): ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా అడ్డుగోడలా నిలబడే గోల్‌కీపర్ శ్రీజేశ్. కేరళకు చెందిన శ్రీజేశ్ భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. శేఖర్ నాయక్ (అంధుల క్రికెట్): అంధుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ (2014)లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాయకుడు శేఖర్. కర్ణాటకకు చెందిన శేఖర్ తన ప్రదర్శనతో అలరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు. -
మన ఆటకు మంచిరోజులు!
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత వెలుగులు కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఈ సంవత్సరం కూడా భారత క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా క్రీడాకారిణులు అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్... రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్... టెన్నిస్‌లో సానియా మీర్జా తమ ప్రతిభాపాటవాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి విజయాలతోపాటు వివాదాలు, వైఫల్యాలు కూడా భారత క్రీడాభిమానులను పలుకరించాయి. రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్–నర్సింగ్ యాదవ్ వివాదం... ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇద్దరు అథ్లెట్స్ డోపింగ్‌లో పట్టుబడటం... మేటి బాక్సర్ మేరీకోమ్ రియో బెర్త్ పొందకపోవడం...2016లో ఇతర విశేషాలు. – సాక్షి క్రీడావిభాగం ‘సూపర్’ సానియా... మహిళల డబుల్స్ టెన్నిస్‌లో హైదరాబాద్ ప్లేయర్ సానియా మీర్జా వరుసగా రెండో ఏడాది సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించింది. ఈ ఏడాది సానియా ఎనిమిది టైటిల్స్ సాధించింది. హింగిస్‌తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, రోమ్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్ టోర్నీలలో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలసి సిన్సినాటి ఓపెన్, టోక్యో ఓపెన్లలో, మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలసి న్యూ హవెన్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో రోహన్ బోపన్నతో కలసి సానియా మీర్జా కాంస్య పతక పోరులో ఓడిపోయింది. లియాండర్ పేస్ ఫ్రెంచ్ ఓపెన్‌లో హింగిస్‌తో జతగా టైటిల్ నెగ్గి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నాడు. రాకెట్ దూసుకెళ్లింది... భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్ క్రీడలో ఈసారీ మనోళ్లు మెరిశారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అనంతరం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఈ ప్రదర్శనతో సింధు సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది అత్యంత మెరుగైన క్రీడాకారిణి పురస్కారాన్ని కూడా గెల్చుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను నెగ్గిన సైనా... రియో ఒలింపిక్స్‌లో మాత్రం గాయం కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. మరో తెలుగు అమ్మాయి రుత్విక శివాని రష్యా గ్రాండ్‌ప్రిలో, దక్షిణాసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్‌కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ స్విస్ ఓపెన్, సాయిప్రణీత్ కెనడా ఓపెన్, సౌరభ్ వర్మ చైనీస్ తైపీ ఓపెన్ టైటిల్స్ సాధించగా... సమీర్ వర్మ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో రష్యా గ్రాండ్‌ప్రి, బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్స్‌ను దక్కించుకుంది. సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. జిగేల్మన్న జాతీయ క్రీడ... ఈ యేడు జాతీయ క్రీడ హాకీ మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రజతం... ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణం... సొంతగడ్డపై జూనియర్ ప్రపంచకప్‌ను సాధించడంతో మన హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా హాకీ ఇండియా చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత మహిళల జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారిక అదే జోరు... గతేడాది ఆన్లైన్ చెస్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. జూన్‌లో వరుసగా రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీలు నెగ్గిన హారిక... ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్‌పై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అద్వానీ అదరహో... క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్)లో భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారి మళ్లీ సత్తా చాటుకున్నాడు. బెంగళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్) చాంపియన్‌షిప్‌లో అద్వానీ విజేతగా నిలిచి తన ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్‌ను జమచేసుకున్నాడు. భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ టైటిల్ నిలబెట్టుకోగా... ధర్మేందర్ మాస్టర్స్కేటగిరీలో ప్రపంచ చాంపియన్ అయ్యాడు. ఆ నలుగురు... రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం, కాంస్యమే లభించినా... అదే వేదికపై జరిగిన పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం దక్కడం విశేషం. మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్ రజతం... పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం గెలిచారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సాధించాడు. అజేయ విజేందర్... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తనకు ఎదురులేదని భారత స్టార్ విజేందర్ సింగ్ తన పంచ్ పవర్‌తో నిరూపించుకున్నాడు. జులైలో భారత్‌లో జరిగిన బౌట్లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)పై గెలిచిన విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాను నాకౌట్ చేసి విజేందర్ ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాది విజేందర్ పోటీపడిన ఐదు బౌట్లలో అజేయంగా నిలువడం విశేషం. ఇక రియో ఒలింపిక్స్‌లో మాత్రం భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ క్రిషన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ‘పట్టు’ సడలించారు... సాక్షి మలిక్ అద్భుత ప్రదర్శన తప్పిస్తే ఈ ఏడాది భారత రెజ్లింగ్ తమ ‘పట్టు’ను సడలించింది. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మలిక్ మహిళల 58 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న యోగేశ్వర్ దత్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 74 కేజీల విభాగంలో తనకూ, నర్సింగ్కు ట్రయల్స్ నిర్వహించి... గెలిచిన వారిని రియో ఒలింపిక్స్‌కు పంపించాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన అభ్యర్థనను భారత రెజ్లింగ్ సమాఖ్య పట్టించుకోలేదు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ‘కూత’ అదిరింది.... ప్రొ కబడ్డీ లీగ్‌తో గ్రామీణ క్రీడ కబడ్డీకి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈసారి రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించారు. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. అనూప్ కుమార్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో 38–29తో ఇరాన్‌ను ఓడించింది. ఓవరాల్‌గా భారత జట్టుకిది వరుసగా మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. దీపా త్రుటిలో... రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అంతకుముందు రియోలోనే జరిగిన టెస్ట్ ఈవెంట్లో దీపా రాణించి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. నీరజ్ సంచలనం అథ్లెటిక్స్‌లో హరియాణా యువ సంచలనం నీరజ్ చోప్రా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జావెలిన్‌ను అతను 86.48 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శన మినహా అథ్లెటిక్స్‌లో ఈ ఏడాది మనకు నిరాశే మిగిలింది. రియో బెర్త్ సాధించిన ధరమ్వీర్ సింగ్ (200 మీటర్లు), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్) డోపింగ్‌లో పట్టుబడి ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు. అడపాదడపా మెరుపులు... ఫుట్‌బాల్‌లో ఈ సంవత్సరం భారత జట్టు అడపాదడపా మెరిపించింది. ఏఎఫ్సీ కప్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు రన్నరప్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్లబ్‌గా గుర్తింపు పొందింది. సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఏడోసారి దక్షిణాసియా (శాఫ్) చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 135వ స్థానానికి చేరుకొని ఆరేళ్ల తర్వాత తమ అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించింది. -
మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్
ఒలింపిక్స్‌లో ప్రదర్శనకుగాను ప్రోత్సాహకంగా సచిన్ చేతుల మీదుగా తాను అందుకున్న బీఎండబ్ల్యూ కారు స్థానంలో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మరో కారును కొనుక్కుంది. అగర్తలా వీధులలో తాను బీఎండబ్ల్యూ కారును వాడలేనంటూ దీపా, తనకు బహుమతి ఇచ్చిన చాముండేశ్వరీనాథ్‌కు తిరిగి ఇచ్చేసింది. దానికి బదులుగా ఆయన నుంచి అందుకున్న రూ. 25 లక్షలతో హ్యుందాయ్ ఎలాంత్రా కారును ఆమె కొనుక్కుందని కోచ్ బిశ్వేశ్వర్ నంది వెల్లడించారు. తమ నగరంలో దానికి సర్వీస్ సెంటర్ కూడా ఉందని ఆయన చెప్పారు. -
సింధుకు సచిన్ 'బీఎండబ్ల్యూ' కానుక!
-
' పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్'
-
'ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు'
-
పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్
♦ గోపిచంద్ గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు: సచిన్ ♦ పీవీసింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, గోపిచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్ల బహుమానం ♦ ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్ హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ 'రియల్ హీరో' అంటూ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్.. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ సింధు, గోపిచంద్, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే మెడల్స్ సాధించగలిగారని ప్రశంసించారు. వీరిని చూసి భారత్ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మరిన్ని మెడల్స్ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్, గోపిచంద్‌లకు సచిన్ కారు తాళాలు అందజేశారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్ వైస్ ప్రెసెడెంట్ చాముండేశ్వరినాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజత పతకం సాధించిన తెలుగు అమ్మాయి, షెట్లర్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒలింపిక్ మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరెన్నీ పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో వచ్చినా.. ఇంత ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది. -
'మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉంది'
-
మహిళా శకానికి స్వాగతం
కొత్త కోణం ప్రతికూల పరిస్థితులు తమను వెనక్కు నెట్టలేవని మన అమ్మాయిలు ఒలింపిక్స్‌లో రుజువు చేశారు. సివిల్స్ టాపర్ టీనా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ సామాజిక అసమానత్వపు సంకెళ్లు తమ ప్రతిభను అడ్డుకోలేవని చాటారు. భారతదేశం నూతన శకం లోనికి అడుగిడుతోందా? అది మహిళల శకం కాబోతున్నదా? బ్రెజిల్ నగరం రియోలో ముగి సిన ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభను కనపర్చిన మహిళలు ఒక్కరు కాదు, ముగ్గురు. ఆడ పుట్టుకను ఈసడిస్తున్న, కట్టు బొట్టు నుంచి నడవడిక వరకు మహిళను శాసిస్తున్న జాతే.. దేశ గౌరవాన్ని నిలిపారని ఆ ముగ్గురు ఆడపిల్లలను వేనోళ్ల కొనియాడుతున్నది. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటే హైదరాబాదీ తెలుగమ్మాయి పి.వి. సింధు, హరియాణాకు చెందిన సాక్షి మాలిక్‌లు ఇద్దరి వల్లనే భారత్ పేరు పతకాల జాబితాలోకి ఎక్కింది. జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ పైనల్స్‌కు చేరడమే గాక నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ ఆడపిల్లే. రియోలో భారత్ పరువును దక్కించిన ముగ్గురూ అమ్మా యిలే. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, భవిష్యత్ దర్పణం. క్రికెట్లోనూ, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లనే రెండు అంతర్జాతీయ క్రీడలలోనూ తప్ప భారత్ పేరు ప్రపంచ క్రీడా రంగంలో వినిపించదు. ఎందరో క్రీడా నిపుణులు, క్రీడాకారులు ఎన్నోసార్లు ఈ దుస్థితికి కారణాలను విశ్లే షించి, పరిష్కారాలను సూచించారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. క్రీడారంగంలోని మన వైఫల్యం లోపభూయిష్టమైన మన విద్యా విధానం వల్ల ఏర్పడిన అనర్థాలలో ఒకటని ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. ప్రపంచపటంలో భూతద్దం పెట్టి వెతికినా కనపడని చిన్న దేశాలు సైతం పతకాలను సొంతం చేసు కుంటుంటే మన దేశం పేరును చివరి నుంచి వెతుక్కో వాల్సిన దుస్థితి. ఏకాగ్రత, సమయపాలన అమ్మాయిల సొత్తు ఇటీవలి కాలంలో విద్యారంగంలో అమ్మాయిలు, అబ్బా యిలతో పోటీపడటమే కాక వారికంటే మెరుగైన ఫలి తాలను సాధిస్తున్న నేపథ్యం నుంచే భారత యువతుల ఒలింపిక్స్ విజయాలను చూడాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఎస్ఎస్సీ, ఇంటర్మీ డియట్, ఎంసెట్ పరీక్షల్లో బాలికల హవా కొనసాగు తోంది. ఇది తెలుగు రాష్ట్రాల అనుభవమే కాదు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణాల్లో కూడా ఇదే కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల్లో కూడా బాలికలు తమ ప్రతిభను నిరూపించుకుంటు న్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) అధ్యయనం సైతం దాదాపు ప్రతి ఏటా బాలికలే టాపర్లుగా నిలుస్తున్నారని తేల్చింది. ఆ సంస్థ ఇందుకు కారణాలను తెలుసుకోవడానికి పది హేనేళ్ల అమ్మాయిలను, అబ్బాయిలను పరిశీలించింది. బాలికలు ముందుండటానికి ముఖ్యమైన ఆరు కారణాలను ఆ అధ్యయనం వెల్లడించింది: 1. పద్ధతి ప్రకారం చదువు సాగించడం, నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటి సాధనకు శాయ శక్తులా ప్రయత్నించడం, 2. స్వయం క్రమశిక్షణను రూపొందించుకోవడం, 3. బాలుర కన్నా బాలికలకు చదివే అలవాటు ఎక్కువ, ఎక్కువ సమయం చదవడా నికే కేటాయిస్తారు. దీనివల్ల కొత్త విషయాలను తెలుసు కునే నేర్పుని సంపాదిస్తారు, 4. బాలురకన్నా బాలికలు హోంవర్క్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయి స్తారు, 5. అబ్బాయిలు పాఠాలు వినడంలో అశ్రద్ధగా ఉంటారు. స్నేహితులతో ఇతర వ్యాపకాలకు ఎక్కువ అలవాటు పడుతుంటారు, 6. అమ్మాయిలు తమ ప్రాధా న్యతలను సరిగ్గా నిర్ణయించుకుంటారు. అబ్బాయిలు మాత్రం సమయపాలన పాటించక పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అంశాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం చదువుకు మాత్రమే వర్తించదని స్పష్టం అవుతోంది. చదువు, క్రీడలు, ఉద్యోగం దేనికైనా ఏకాగ్రత అవసరం. అది అమ్మాయిలలోనే ఎక్కువని అర్థం అవుతోంది. అన్నీ ప్రతికూలతలే అయినా... . భారత్‌లోలాగే మహిళలు, బాలికల పట్ల తీవ్ర వివక్ష అమలవుతున్న పాకిస్తాన్లో కూడా గత విద్యా సంవత్స రంలో పదవ తరగతి పరీక్షల్లో బాలికలే పై చేయి సాధించారు. అమెరికాలోని న్యూబ్రన్స్విక్ విశ్వవిద్యా లయం తమ దేశంతో సహా 30 దేశాల్లోని 10 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే నని ఆ అధ్యయనంలో తేలింది. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాల్లోని అధ్యయ నాలు కూడా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకే క్రమ శిక్షణతో లక్ష్యాలను సాధించే శక్తిసామర్థ్యాలు ఎక్కువని స్పష్టం చేశాయి. అయితే అమెరికాలాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు, బాలికల పట్ల సాంప్ర దాయాల పేరుతో అమలవుతున్న తిరోగమన భావ జాలం వల్ల మన అమ్మాయిలు ప్రతిభావంతులు కావ డానికి తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందనేది వాస్తవం. వీటిలో మొదటిది స్త్రీపురుష సమానత్వ భావన కొరవడటం వల్ల ఆడవాళ్లు రెండవ శ్రేణి పౌరులనే అభిప్రాయం బలంగా ఉండటం. ఒకవంక మగ పిల్లలకు అదనపు అవకాశాలను సమకూర్చే ధోరణి కనబడు తుంది. మరోవంక తిండి, బట్ట నుంచి విద్య, క్రీడల వరకు అన్ని విషయాల్లోనూ ఇంటా బయటా వివక్ష కొనసాగుతోంది. పైగా దీన్నే మన ఘనమైన సంస్కృ తిగా కొనియాడటం విచారకరం. ఈ పితృస్వామిక సంస్కృతి, దుస్సంప్రదాయాలు పేద మధ్య తరగతి కుటుంబాలను ప్రత్యేకించి ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. కూతుర్ని వసతులు, సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాల లకు, కొడుకును ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలకు పంప డమూ, ఉద్యోగం పురుష లక్షణంగా, అమ్మాయిలకు పెళ్ళే పరమావధిగా భోదించడం వంటివి ఎన్నో. ఒకటేమిటి అడుగడుగునా ఇలా అమ్మాయిల పట్ల చూపుతున్న వివక్ష కారణంగా వారు అన్ని అవరోధా లను ఎదుర్కొంటూనే ఉన్నారు. కేవలం టాయ్‌లెట్స్ లేకనే ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్న దుస్థితి. విద్యాలయాల్లో, ఆ దారుల్లో విద్యార్థినులపై సాగుతున్న వేధింపులు, హింస కారణంగా ఎందరో ఆడపిల్లలు చదువులు మానేసు కోవాల్సి వస్తోంది. ఇన్ని ప్రతికూ లతల మధ్య అమ్మాయిలు విద్యలోనూ, క్రీడలలోనూ మంచి ప్రతిభను కనబరుస్తుండటం ఆశించదగ్గ పరిణామం. అవకాశాల నిరాకరణ వెనుకబాటుకు బాట ఇంకొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించుకోవాలి. స్వత హాగానే మహిళలు ఎంతో శక్తిసామర్థ్యాలు కలవారు. సమాజంలో వారిపట్ల ఉన్న వివక్ష వల్ల వారికి అవ కాశాలు రావడం లేదు. ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించాలంటే ఇతరులతో సమాన అవకాశాలు కల్పిం చడం తప్పనిసరి. అప్పుడే నిజమైన ప్రతిభ బయట పడుతుంది. స్త్రీలలాగే ఆదివాసులు, దళితుల పట్ల కూడా వివక్ష అమలవుతోంది. సరిగ్గా చెప్పాలంటే సమాజంలో ఉన్న అవకాశాలన్నీ పురుషాధిపత్య, కులాధిపత్య దృక్కోణం నుంచి కల్పించినవే. అయితే ఏ సామా జిక వర్గానికి చెందినవారైనా స్త్రీలు అదనంగా జెండర్ వివక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎస్సీ, ఎస్టీలనూ, మహిళలను కలిపితే దేశంలో మూడింట రెండు వంతులకు పైగా సమాన అవకాశాలకు దూర మయ్యారు. ఒలింపిక్స్‌లో కీలకమైన అథ్లెటిక్స్ పోటీల్లో మనం విజేతలకు దరిదాపుల్లో కూడా లేం. కొండలూ గుట్టలు అవలీలగా ఎక్కగలిగే ఆదివాసీ యువతీయువకులకు సరైన శిక్షణనిస్తే అథ్లెటిక్స్‌లోనూ మనం రాణించగలం. పతకాల కోసమనే కాదు మానవ శారీరక మానసిక వికాసం కోసం కూడా క్రీడల ఆవశ్యకతను పాలకులు గుర్తించాలి. కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదు రవుతున్న ప్రతికూల పరిస్థితులు తమను ఎంతో కాలం వెనక్కు నెట్టలేవని మన అమ్మాయిలు నేడు ఒలిం పిక్స్‌లో రుజువు చేశారు. అంతకు ముందు సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా, అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ని అధిరోహించిన పూర్ణ అసమానత్వపు సంకెళ్లు తమ ప్రతిభకు అడ్డం కాజాలవని చాటారు. టీనా, పూర్ణలు దళిత, ఆదివాసీ బిడ్డలు. వీటిని రాబోయే మహిళా శకానికి సూచనలుగా చూడాలి. బాలికల, మహిళల శక్తి సామర్థ్యాల అణచివేతకు ముగింపు పలకడానికి, వారి శక్తియుక్తులకు పదును పెట్టడానికి సమాజం, కుటుంబం, ప్రభుత్వాలు సమైక్యంగా కృషి చేయడమే తక్షణ కర్తవ్యం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213 -
పరీక్షలు రాస్తోంది
అగర్తలా: ఆట, చదువు రెండూ ఒకే చోట పొసగవని చాలామందిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిరూపిస్తోంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన రెండో రోజే ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పరీక్ష రాసేసింది. త్రిపుర యూనివ ర్శిటీలో దీప పీజీ చదువుతోంది. చాలా సన్మాన కార్యక్రమాలు ఉన్నా వాటిని వదిలేసి పరీక్షలకు చదువుకోవడం గొప్ప విషయమని త్రిపుర యూనివర్శిటీ అధికారులు ఆమెను ప్రశంసించారు. తోటి విద్యార్థినిలు కూడా ఆమె అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!
ఒలింపిక్స్‌లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు. మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది. ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్‌కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. -
ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప
న్యూఢిల్లీ: ‘వాల్ట్ ఆఫ్ డెత్’గా పిలిచే ప్రొడునోవా విన్యాసాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. రియోలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప శనివారం కోచ్ విశ్వేశ్వర్ నందితో కలిసి భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ‘ఒలింపిక్ పతకం కోసం గట్టిగా కృషిచేశా. కానీ ఈసారి సాధించలేకపోయాను. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం గెలుస్తాను. ప్రొడునోవా విన్యాసాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తా. అందరు అనుకుంటున్నట్లు అది డెత్వాల్ట్ విన్యాసం కాదు. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ప్రొడునోవా చేయడం కష్టమేం కాదు’ అని దీపా పేర్కొంది. -
టోక్యోలో గెలుస్తా...
రియోలో పతకం ఆశించలేదు నా ప్రదర్శన సిమోన్ కన్నా గొప్ప జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ ప్రదర్శనపై భారతదేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్యం కోల్పోయినా అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ త్రిపుర అమ్మాయి కూడా తన ప్రదర్శన పట్ల అమితానందాన్ని వ్యక్తం చేసింది. తృటిలో పతకం కోల్పోయినందుకు తానేమీ బాధపడడం లేదని, వాస్తవానికి రియో గేమ్స్‌లో మెడల్ ఆశించలేదని స్పష్టం చేసింది. ఫైనల్స్‌లో తను ల్యాండింగ్ సరిగ్గానే చేసినా కొన్ని సెకన్ల పాటు కింద కూర్చోవడంతో పాయింట్లు కోల్పోయింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా స్వర్ణం నెగ్గుతానని ధీమా వ్యక్తం చేస్తోన్న 23 ఏళ్ల దీపా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. పతకాన్ని ఊహించలేదు: నిజం చెప్పాలంటే రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఆశించలేదు. కానీ నాలుగో స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. బాక్సింగ్లోనైతే ఈ స్థానంలో వస్తే కాంస్యం దక్కేది. కానీ నాలుగేళ్ల తర్వాత నా లక్ష్యం స్వర్ణంపైనే ఉంటుంది. ఇది నా తొలి ఒలింపిక్స్ కాబట్టి నిరాశ అవసరం లేదు. అత్యుత్తమ స్కోరు సాధించా: ఓవరాల్‌గా నా ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నాను. ఫైనల్స్‌లో 15.066తో నా అత్యధిక స్కోరు సాధించా. అయితే పతకం సాధించిన వారు నాకన్నా మెరుగైన ప్రదర్శన చేశారు. కొద్ది పాయింట్ల తేడాతో పతకం కోల్పోయాను. అయినా నా తొలి గేమ్స్‌లో నాలుగో స్థానాన్ని నేను ఊహించలేదు. రెండు వాల్ట్స్‌లో నా స్కోరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతమయ్యాను. ప్రొడునోవాలో గతంలో 15.1 స్కోరు అత్యధికంగా ఉండేది. ఇక్కడ 15.266 వరకు సాధించగలిగాను. స్వదేశీ కోచ్‌తోనే ఇంత సాధించాను: జిమ్నాస్టిక్స్ అంత సులువైన క్రీడ కాదు. మనకు ఇందులో విదేశీ కోచ్ కూడా లేడు. నేనింత వరకు సాధించింది కూడా స్వదేశీ కోచ్ బిశ్వేశ్వర్ నంది, సాయ్ కృషితోనే. ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ మాజీ చాంపియన్లను కూడా వెనక్కినెట్టి నాలుగో స్థానంలో నిలవగలిగాను. అందుకే ఇది సిమోన్ బైల్స్ సాధించిన దానికన్నా పెద్ద ఘనతగా నేను భావిస్తున్నాను. విశేష మద్దతు: కోట్లాది మంది భారతీయుల ప్రార్థనల వల్లే ఇక్కడిదాకా రాగలిగాను. వారందరికీ నా కృతజ్ఞతలు. గతంలో మిల్కా సింగ్, పీటీ ఉష కూడా నాలుగో స్థానంలో నిలిచారని పోలిక తెస్తున్నా... నేను వారితో సరితూగలేను. స్వర్ణం సాధించాకే వారితో పోల్చుకోగలను. అభినందనల వెల్లువ తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘గెలుపు, ఓటమి అనేది ఏ క్రీడలోనైనా సహజమే. కానీ నీవు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నావు. భారతదేశమంతా నీ ఘనతకు గర్విస్తోంది’ అని సచిన్ ట్వీట్ చేయగా... ‘దీపా.. నువ్వు నా హీరోవి’ అని షూటర్ అభినవ్ బింద్రా స్పందించాడు. అమితాబ్ సహా పలువరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు. గేమ్స్ విలేజికి వెళ్లాక బాధను ఆపుకోలేక భోరున విలపించింది. ‘దీప పోరాటాన్ని అంతా పొగిడినా మేం మాత్రం ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా భావించాం. మా దృష్టిలో ఈ స్వాతంత్య్ర దినోత్సవం భారంగా గడిచింది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. దీప చాలాసేపు విలపించింది’ అని కోచ్ నంది అన్నారు. -
దీప అదృష్టం అక్కడే తారుమారు..
రియో డీ జనీరో: దీపా కర్మాకర్.. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్. అంతేకాకుండా రియోలో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో తుది పోరుకు అర్హత సాధించి సరికొత్త చరిత్రను కూడా లిఖించింది. అయితే భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దీపా నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. కాగా, దీపను పాయింట్ల పరంగా వెనుక్క నెట్టింది మాత్రం సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు), మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు)లు మాత్రమే. ఫైనల్ పోరులో భాగంగా వరల్డ్ టాప్ జిమ్నాస్ట్లైన బైల్స్, పాసెకాలు చివర్లో బరిలోకి దిగి దీప ఆశలను నీరుగార్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-8కు అర్హత సాధించిన వారు ఫైనల్ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో దీపా ఆరో స్థానంలో బరిలోకి దిగింది. తొలి ప్రయత్నంలో14.866 పాయింట్లుసాధించిన దీప... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది. దీంతో ఓవరాల్ సగటు 15.066 పాయింట్లగా నమోదైంది. దీంతో దీప తన రౌండ్ ను ముగించిన తరువాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. కాగా, చివర్లో పాసికా, బైల్స్‌లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో దీపా అనూహ్యంగా వెనక్కిపడిపోయింది. అయినప్పటికీ యావత్ భారతావని మనసును మాత్రం గెలుచుకుంది. కష్టసాధ్యమైన ప్రొడునోవాలో ముందుకు వెళ్లడమే తలకు మించిన భారం. మరి అటువంటింది 'టాప్' జిమ్నాస్ట్‌ల చేతిలో ఓడిపోయిన దీపది కచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శనే కదా.ప్రస్తుతం భారత్ లో దీప ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురవడమే ఆమె పోరాట స్ఫూర్తికి నిదర్శనం. -
త్రుటిలో చేజారిన పతకం
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నాలుగో స్థానం రియో డి జనీరో: ప్రమాదకర విన్యాసం ప్రోడునోవా చేసినప్పటికీ... భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్ ఈవెంట్లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో దీపా 14.866 పాయింట్లు... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది. ఈ రెండు ప్రయత్నాల స్కోర్లను కలిపి సగటు తీయగా... దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు) రజతం... గిలియా స్టింగ్‌రూబెర్ (స్విట్జర్లాండ్-15.216 పాయింట్లు) కాంస్య పతకం గెలిచారు. మొత్తం ఎనిమిది మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్లో తలపడ్డారు. అందరికీ రెండేసి అవకాశాలు ఇచ్చారు. వరుసగా ఏడో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ 41 ఏళ్ల ఒక్సానా చుసోవితినా (ఉజ్బెకిస్తాన్-14.833 పాయింట్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడింది. -
మన 'దీపం' వెలిగింది
• ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు అర్హత • వాల్ట్ ఈవెంట్లో సత్తా చాటిన కర్మాకర్ • ఈ నెల 14న ఫైనల్స్ భారత జిమ్నాస్టిక్స్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన దీపా కర్మాకర్.... తన మీద ఉన్న భారీ అంచనాలను అందుకుంటూ... పతక అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. రియోలో పతకం కచ్చితంగా సాధిస్తారని భావించిన వారు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతుండగా... దీపా మాత్రం మొక్కవోని దీక్షతో పోరాడింది. తనకు అత్యంత ఇష్టమైన, పట్టు ఉన్న వాల్ట్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి భారత శిబిరంలో ఆశలు పెంచింది. రియో : తన 23వ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు దీపా కర్మాకర్ మరోసారి దేశం గర్వించే ప్రదర్శనను కనబర్చింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు అందుకున్న ఆమె తనపై దేశం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టింది. ఆదివారం జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్లో దీప ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. తద్వారా తొలి ప్రయత్నంలో ఫైనల్‌కు చేరిన మరో ఘనతను అందుకుంది. మొత్తం 14.850 పాయింట్లతో ఆమె ఎనిమిదో స్థానంలో నిలవడం విశేషం. క్వాలిఫయింగ్ పోటీల్లో అమెరికా స్టార్ సైమన్ బైల్స్ అగ్రస్థానంలో (16.050 పాయింట్లు) నిలిచింది. ఇతర ఈవెంట్లలో 11.666 (అన్ ఈవెన్ బార్స్), 12.866 (బ్యాలెన్సింగ్ బీమ్), ఫ్లోర్ ఎక్సర్సైజ్ (12.033) స్కోరు చేసిన దీప, ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఆమెపై పెనాల్టీ కూడా పడింది. ఆల్‌రౌండ్ జాబితాలో 51.665 పాయింట్లతో 47వ స్థానంతో సరి పెట్టుకున్న ఆమె... తన ప్రధాన ఈవెంట్ వాల్ట్‌లో మాత్రం అంచనాలను అందుకుంది. ‘ఇవి నా తొలి ఒలింపిక్స్. ఫైనల్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. హాల్లో విపరీతమైన గోలతో నేను మ్యూజిక్‌ను కూడా సరిగా వినలేకపోయాను. పాయింట్లు ఇచ్చే విషయంలో జడ్జిలు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు నాకనిపిస్తోంది. నా ప్రదర్శన సంతృప్తినిచ్చినా ఇంతకంటే ఇంకా బాగా చేయాల్సింది’ అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది. కోచ్ ఉద్వేగం... ఒలింపిక్స్‌లో దీప ప్రదర్శన పట్ల ఆమె కోచ్ విశ్వేశ్వర్ నంది గర్వపడుతున్నాడు. అయితే అదే సమయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘వంద కోట్ల మంది భారతీయుల ఆశలను ఆమె మోస్తోంది. దేశంలో ప్రతీ ఒక్కరు దీప పతకం గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు. అది ఎంత కష్టమో చాలా మందికి తెలీదు. 0.001 పాయింట్ తేడాతో మెడల్ కోల్పోయే అవకాశం ఇక్కడ ఉంది. ఇంత ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’ అని విశ్వేశ్వర్ వ్యాఖ్యానించారు. దీప కెరీర్ ఆరంభంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించి పాత సెకండ్ హ్యాండ్ స్కూటర్ విడి భాగాలు, తుక్కు సామాను ఉపయోగించి ప్రాక్టీస్‌కు కావాల్సిన స్ప్రింగ్ బోర్డు, వాల్ట్ తదితర పరికరాలను తయారు చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం తనను కనీసం ఎవరూ గుర్తు పట్టలేకపోయేవారని, ఇప్పుడు దీప కారణంగా ఒక్కసారిగా అందరికీ తెలిసినట్లు విశ్వేశ్వర్ ఉద్వేగంగా చెప్పారు. ప్రపంచానికి దూరంగా... ఆదివారం జరిగే ఫైనల్స్‌కు ముందు దీపా కర్మాకర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండకుండా, ఇతర అంశాల వైపు ధ్యాస మళ్లకుండా కోచ్ విశ్వేశ్వర్ నంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం నాలుగేసి గంటల పాటు సాధన తప్ప ఆమెకు మరో ప్రపంచం ఉండరాదని ఆయన భావిస్తున్నారు. మంగళవారం దీప పుట్టిన రోజున కూడా తల్లిదండ్రులతో తప్ప మరెవరితో మాట్లాడరాదని కూడా కోచ్ చెప్పేశారు. ‘ఆమె మొబైల్‌నుంచి సిమ్ కార్డు తీసేశాను. తల్లిదండ్రులతో మాత్రం మాట్లాడనిస్తాను. ఎలాగూ పెద్దగా స్నేహితులు కూడా లేరు. ఆదివారం ఆమె పతకం గెలుస్తుందని నాకు నమ్మకముంది. ఈవెంట్ ముగిసే సమయానికి భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 అవుతుంది. గెలిస్తే స్వాతంత్య్ర దినోత్సవం, పుట్టిన రోజు ఒకేసారి జరుపుకుంటాం’ అని విశ్వేశ్వర్ చెప్పారు. అంత సులభం కాదు... దీపా కర్మాకర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ (వాల్ట్)లో ఫైనల్‌కు అర్హత సాధించిందనగానే మనందరిలో సహజమైన ఆనందం పొంగుకొచ్చేసింది. ఈ నెల 14న జరిగే ఫైనల్లో ఆమె మరింత బాగా ఆడి పతకం సాధించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తం నాలుగు ఈవెంట్లలో పాల్గొన్న ఆమె, మూడు విభాగాలు అన్ ఈవెన్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, బీమ్‌లలో విఫలమైంది. వాల్ట్ ఈవెంట్లో మాత్రం సత్తా చాటి ముందుకు దూసుకుపోయింది. అసలు ఈ వాల్ట్ ఎలా ఉంటుంది, ఇందులో పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో వాల్ట్ ఒక ఈవెంట్. పోటీల కోసం వాల్టింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. జిమ్నాస్ట్‌లు రన్‌వేపై పరుగెత్తుకు వచ్చి స్ప్రింగ్ బోర్డు ఆధారంగా పైకి లేస్తారు. అదే ఊపులో వాల్ట్పై రెండు చేతులు ఉంచి (ప్రి ఫ్లయిట్) ఆ తర్వాత గాల్లో పల్టీలు కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిమ్నాస్ట్ టేబుల్ ఇదే విభాగంలో భాగమైన యుర్చెంకోలో అయితే స్ప్రింగ్ బోర్డుపై వెళ్లక ముందు కూడా మ్యాట్‌పై చేతులు ఉంచాలి. వాల్ట్పైనుంచి పల్టీలు కొడుతూ సరైన విధం గా మ్యాట్‌పై నిలవాలి. గాల్లో లేచినప్పుడు సులభంగానే అనిపించినా పల్టీలు కొట్టే సమయంలో జిమ్నాస్ట్‌కు చాలా నియంత్రణ ఉండాలి. వాల్ట్‌లోనే వేర్వేరు స్టైల్లు ఉంటాయి. హ్యండ్స్ప్రింగ్, యమషిత, సుకహారా, యుర్చెంకో, ఖోర్కినా అంశాలలో జిమ్నాస్ట్‌లు ప్రదర్శన ఇస్తారు. పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఎలాంటి గందరగోళం, తడబాటు లేకుండా మ్యాట్‌పై చూపించిన ల్యాండింగ్ జోన్లో వాలడాన్ని బట్టే పాయింట్లు ఉంటాయి. ప్రతీ వాల్ట్‌కు నిర్ణీత పాయింట్లు కేటాయిస్తారు. దానిని పూర్తి చేస్తే ఆ పాయింట్లే లభిస్తాయి. పడిపోవడం, సరిగ్గా నిలబడలేకపోతే పాయింట్లు పోతాయి. జడ్జీలు ప్రధానంగా నాలుగు అంశాలు ప్రి ఫ్లయిట్, సపోర్ట్, ఆఫ్టర్ ఫ్లయిట్, ల్యాండింగ్లపై దృష్టి పెట్టి పాయింట్లు ఇస్తారు. వేగంగా సాగిపోయే ఈ ఆటలో జిమ్నాస్ట్‌ల మధ్య సాధారణంగా 0.2 పాయింట్ల తేడా మాత్రం ఉంటుంది. 2005నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం కష్టమైన అంశాలకు ఎక్కువ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్లిప్పింగ్, ట్విస్టింగ్, టర్నింగ్ తదితర ఎనిమిది అంశాలు ఎలా చేశారనేదానిపై పాయింట్లు ఆధారపడి ఉంటాయి. దీప ఏం చేసింది... వాల్ట్‌లో దీప మొత్తం 14.850 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి ప్రయత్నంలో డిఫికల్టీలో 7 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె, ఎగ్జిక్యూషన్లో 8.1 పాయింట్లు సాధించింది. ఆమెకు ఎక్కువ పాయింట్లు అందించడంలో ప్రొడునోవా ఈవెంట్దే కీలక పాత్ర. ఎగ్జిక్యూషన్ స్కోర్ ఎలా చేశారనే దాని ఆధారంగా పాయింట్లు వస్తాయి. బేస్ స్కోర్ 10 ఉంటే... ఫాల్స్, తడబాటు, మధ్యలో ఆగిపోవడం వంటివి చూసి జడ్జిలు పాయింట్లు తగ్గిస్తారు. ఈ ప్రక్రియను ఎగ్జిక్యూషన్ స్కోర్ అంటారు. డిఫికల్టీ స్కోర్ ఎంత కష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియను ఎంత బాగా చేశారనేదాన్ని బట్టి డిఫికల్టీ స్కోరు లభిస్తుంది. గరిష్ట డిఫికల్టీ స్కోరు అని ఏమీ ఉండదు. ప్రొడునోవా: ప్రాణాలకే ప్రమాదకర విన్యాసం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన ఈవెంట్. ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్‌తో పాటు రెండు ఫ్రంట్ సోమర్ సాల్ట్‌లు కలిసి ఉంటాయి. దీని ప్రస్తుత డిఫికల్టీ స్కోరు 7. ఎక్కువ పాయింట్లు సాధించడం కోసం ఈ ప్రమాదకరమైన అంశాన్ని కొంత మంది జిమ్నాస్ట్‌లు ఎంచుకుంటారు. దీపా కూడా అదే చేసింది. ఓవరాల్‌గా కూడా ప్రొడునోవాను ప్రపంచంలో ఐదుగురు మాత్రమే పర్ఫెక్ట్గా పూర్తి చేయగలిగినవారిలో దీప కూడా ఉంది. 1980 ఒలింపిక్స్ మొదలు ఇప్పటి వరకు చాలా మంది ఈ సాహసం చేయబోయే తీవ్ర గాయాల పాలై, చావుకు దగ్గరగా వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. దీనితో ఈ అంశాన్ని నిషేధించాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆదివారం పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా జిమ్నాస్ట్ దిగ్గజం సైమన్ బైల్స్ కూడా గతంలో ‘నేను చనిపోవడానికి ప్రయత్నించను’ అని దీని గురించి వ్యాఖ్యానించింది. రియోలో కూడా ఆమె దీనికి దూరంగానే ఉంది. -
52 సంవత్సరాల తర్వాత...
రియోకు భారత్ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్రాతినిధ్యం ఉంది. ఆర్టిస్టిక్స్‌లో దీపా కర్మాకర్ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించింది. రియోలోనే జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో దీపా కర్మాకర్ ఆకట్టుకుంది. -
కొండగాలి తిరిగింది
త్రిపుర కొండ ప్రాంతం. పచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉంటుంది. పొడిగా ఉంటుంది. తేమగా ఉంటుంది. మొత్తం మీద ప్రకృతి ఒడిలో పెరుగుతున్న అనాథ బిడ్డలా ఉంటుంది. పేరుకు రాష్ర్టమే. ప్రతిష్టకు గ్రామం. ఇప్పుడు ఆ ‘గ్రామం’లో కొండగాలి తిరిగింది. రియో వైపు మళ్లింది. అక్కడి నుంచి ఆ గాలి బంగారు పతకాన్ని మోసుకొచ్చిందా... త్రిపుర ఇక గ్రామం కాదు, రాష్ట్రం కూడా కాదు. దేశ కీర్తిప్రతిష్టల రాజధాని! ఆ రాజధాని నిర్మాణం ఇప్పుడు దీపా కర్మాకర్ అనే అమ్మాయి చేతిలో ఉంది. త్రిపుర చిన్న రాష్ట్రం. పేద రాష్ట్రం. దేశంలో సగం మందికి త్రిపుర ఎక్కడుందో తెలీదు. మిగతా సగానికి అదొక ఈశాన్య రాష్ట్రం అన్నంత వరకే తెలుసు. త్రిపుర ముఖ్యమంత్రి, త్రిపుర గవర్నర్ ఎవరంటే వెంటనే చెప్పేవాళ్లు కూడా అంత విస్తారంగా ఉండకపోవచ్చు. కానీ త్రిపుర అంటే ఇప్పుడు దీప! త్రిపుర ఖ్యాతిజ్వాల.. దీపా కర్మాకర్. త్రిపుర రాజధాని అగర్తలలో పుట్టిన ఈ అమ్మాయి వల్ల అకస్మాత్తుగా త్రిపుర అంతర్జాతీయ నామం అయిపోయింది. అగర్తలలోని అభోయ్ నగర్లో ఉంటున్న దీపకు గత వారం రోజులుగా తీరికే ఉండడం లేదు. చుట్టుపక్కల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చెయ్యిపట్టుకుని తీసుకువచ్చి దీపను వారికి స్ఫూర్తిగా చూపిస్తున్నారు. ‘రెండు ముక్కలు మాట్లాడమ్మా’ అని కూడా అడుగుతున్నారు! అగర్తలలో ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్‌కి సమానంగా సెలబ్రిటీ అయిపోయారు. ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు, ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడేవారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. చిన్న పిల్ల... పెద్ద అడుగు! చిన్న పిల్లలు భయపడతారు. జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నప్పుడు మొదట్లో దీప చాలా భయపడేది. పడిపోతానేమో, దెబ్బలు తగులుతాయేమోనని ఆమె భయం. తల్లి ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పింది. జీవితాన్ని సవాలుగా తీసుకున్నవారు భయపడకూడదని. భయపడితే ఏదీ సాధించలేమనీ, అనుకున్నది అసలే సాధించలేమనీ. ఆ మాటల్ని విశ్వసించింది దీప. ఒలింపిక్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. బరి వరకు వచ్చేసింది. ఒక్క పెద్ద అడుగుతో. ఒకటే కల.. ఒకటే దీక్ష దీప దీక్ష పట్టింది. ఎలాగైనా ఒలింపిక్స్‌లోకి వెళ్లాలని పంతం పట్టింది. ఇంటి బయట పిల్లల్లో ఆడుకోవడం ఇష్టం తనకు. ఆ ఆటల్ని త్యాగం చేసింది. అమ్మతో కబుర్లు చెబుతూ తీరిగ్గా భోజనం చేయడం ఇష్టం తనకు. ఆ ‘తీరిక భోజనాన్నీ’ త్యాగం చేసింది. సినిమాలు, షికార్లు, స్నేహితులు, చిన్న చిన్న షాపింగులు అన్నీ బంద్. ఒక్కోసారి దీప పడుతున్న కష్టం చూడలేకపోయేవారు తల్లిదండ్రులు. కానీ వాళ్లూ దీక్ష పట్టారు. దేశం గౌరవించేంత ఎత్తులో, దేశానికి గౌరవం తెచ్చేంత ఎత్తులో కూతుర్ని తలెత్తి చూడాలని. అందుకే ఆమెతోపాటు వాళ్లూ కొన్ని త్యాగాలు చేశారు. నిద్ర మానుకున్నారు. దీప ప్రాక్టీస్‌కు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడం కోసం కష్టపడ్డారు. దీప తండ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అగర్తల కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్. అయితే ఆ పరిచయాలను కూతురు కోసం ఉపయోగించుకోలేదు ఆయన. తొలిసారి దీప పోటీలకు వెళ్లినప్పుడు షూజ్ లేవు. వట్టి కాళ్లతోనే వెళ్లింది. వేసుకున్న ఆ డ్రెస్ కూడా అద్దెకు తెచ్చుకున్నదే! అయితే ఆమె లక్ష్యం ముందు అవి ఏమంత ప్రాముఖ్యంలేని విషయాలు. దీప తన 14 ఏళ్ల వయసులో తొలి విజయాన్ని చవి చూసింది. జూనియర్ నేషనల్స్‌లో విజయం సాధించి కోచ్‌కి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. ఇప్పుడు అదే నమ్మకం దేశ ప్రజలకు కలిగింది. ఎలుకలు, బొద్దింకలతో కలిసి ప్రాక్టీస్! కోచింగ్ తీసుకుంటున్న మొదట్లో దీప వెళ్లే జిమ్‌లో సరైన పరికరాలు ఉండేవి కావు. కనీసం వాల్టింగ్ టేబుల్ కూడా ఉండేది కాదు. జిమ్‌కు వచ్చే అమ్మాయిలు, దీప.. ఒకరి వీపులపై ఒకరు మ్యాట్లు వేసుకుని వారి మీది నుంచి దూకేవారు. అదే వారి వాల్టింగ్ టేబుల్! వర్షాకాలం జిమ్ కొట్టుకుపోయేది. ఏకాలమైనా సరే జిమ్‌లో ఎలుకలు, బొద్దింకలు కాళ్లకు, చేతులకు తగులుతూ ప్రాక్టీస్‌కు అడ్డుపడుతుండేవి. అలా దీప ప్రారంభ సాధనలన్నీ పోరాట విన్యాసాలుగానే మిగిలిపోయాయి. అలా కామన్వెల్త్ గేమ్స్ వరకు వెళ్లగలిగారు. 2014లో కామన్వెల్త్ ఫైనల్స్ జరుగుతున్నాయి. చీలమండ దగ్గర ఆమె కాలు బాగా వాచిపోయింది. వాల్ట్ జంపింగ్ చెయ్యడం మంచిది కాదని కోచ్ సహా చాలామంది చెప్పారు. దీప వినలేదు. రిస్క్ తీసుకోకపోతే లైఫే లేదనుకుంది. అలాగే వెళ్లి పొల్గొంది. నెగ్గింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ ఈవెంట్లో కాంస్యం గెలవగానే దీప పేరు మారుమోగి పోయింది. ‘తీసుకున్నది తిరిగి ఇస్తాను..’ ‘తీసుకున్నదానికి రెట్టింపుగా త్రిపుర కు నేను తిరిగి ఇచ్చేస్తాను’ అని బి.బి.సి.న్యూస్ ఇంటర్వ్యూలో కాస్త ఉద్వేగంగా చెప్పారు దీప. అలా అంటున్నప్పుడు ఆమె స్వరంలో కృతజ్ఞత ధ్వనించింది. ఇంతకీ దీపకు త్రిపుర ఏం ఇచ్చింది? ప్రేమ! సపోర్ట్! ఆ రుణం తీర్చుకోవాలంటే దీపకు ప్రస్తుతం కనిపిస్తున్న ఒకే ఒక మార్గం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించుకురావడం. ఒలింపిక్స్‌లో దీప గోల్డ్ కొట్టాలంటే... రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ద్వారా దీపా కర్మాకర్ తన తొలి లక్ష్యాన్ని సాధించింది. ఆమె రెండో లక్ష్యం పతకం సాధించడమే. అయితే తన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే దీప రెట్టింపుస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. విశ్వ క్రీడాసంరంభమైన ఒలింపిక్స్ క్రీడల్లో అత్యున్నతస్థాయి క్రీడాకారిణులు పాల్గొంటారు. బరిలో దిగిన ప్రతి ఒక్కరూ పతకం సాధించాలనే లక్ష్యంతోనే వస్తారు. జిమ్నాస్టిక్స్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అమెరికా, చైనా, జపాన్, రుమేనియా దేశాల అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌లతో పోటీపడుతూ దీపా పతకం రేసులో నిలవాలంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 7న మళ్లీ క్వాలిఫై కావాలి పతకం రేసులో నిలవాలంటే దీపా కర్మాకర్ ముందుగా క్వాలిఫయింగ్ పోటీల్లో రాణించాలి. ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా ఆగస్టు 7వ తేదీన దీప క్వాలిఫయింగ్ పోటీలు ఉన్నాయి. ఆ రోజు దీప నాలుగు ఆపరేటస్ (ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్) అంశాల్లో తన విన్యాసాలు ప్రదర్శించాలి. ఈ నాలుగు అంశాల్లో కలిపి అత్యధిక పాయింట్లు సాధించిన టాప్-24 క్రీడాకారిణులు ఆల్‌రౌండ్ వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్స్‌లో టాప్-3లో నిలిచిన వారికి పతకాలు లభిస్తాయి. ఆగస్టు 14న ఫైనల్స్ ఆల్‌రౌండ్ విభాగం కాకుండా ఈ నాలుగు ఆపరేటస్ (ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్) అంశాల్లో వేర్వేరుగా నిర్వహించే క్వాలిఫయింగ్ పోటీల్లో టాప్-8లో నిలిచేవారు వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. ఫైనల్స్‌లో టాప్-3లో నిలిచే వారికి పతకాలు దక్కుతాయి. వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్స్‌ను ఆగస్టు 11న... ‘వాల్ట్’ ఈవెంట్ ఫైనల్స్‌ను ఆగస్టు 14న నిర్వహిస్తారు. దీపా కర్మాకర్ ప్రధాన ఈవెంట్ ‘వాల్ట్’. ఆమె ఈ అంశంలోనే సిద్ధహస్తురాలు. క్వాలిఫయింగ్‌లో అందరికీ రెండుసార్లు చొప్పున అవకాశం లభిస్తుంది. అనంతరం ఆయా జిమ్నాస్ట్‌లు కనబరిచిన విన్యాసాల ఆధారంగా వారికి పాయింట్లు ఇస్తారు. వారు సాధించిన ఓవరాల్ స్కోరును లెక్కిస్తారు. కనీసం 15 పాయింట్లు స్కోరు చేస్తే ఫైనల్‌కు అర్హత సాధించినట్టే. ఫైనల్స్‌కు చేరిన ఎనిమిది మందికి మరోసారి రెండుసార్లు చొప్పున తమ విన్యాసాలను ప్రదర్శించే అవకాశం ఇస్తారు. ఇక్కడా 15 పాయింట్లు సాధిస్తేనే పతకావకాశాలు ఉంటాయి. రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో దీపా కర్మాకర్ ‘వాల్ట్’ ఈవెంట్లో రెండుసార్లు 15 కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు సాధించింది. ఇదేరకమైన ప్రదర్శన ఒలింపిక్స్‌లోనూ ఆమె పునరావృతం చేస్తే... కాస్త అదృష్టం కూడా తోడైతే ఆమె మెడలో పతకం చూడొచ్చు. ఘనత ⇒ జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ ⇒ 52 ఏళ్ల తర్వాత.. దీప వల్లనే ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ బరిలోకి భారత్ ⇒ 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీప! దీప సాధించుకు వచ్చింది 1964 నుంచి నేటి వరకు ఒక్క భారతీయ పురుష జిమ్నాస్ట్ కూడా ఒలింపిక్స్ బరి వరకూ రాలేదు. ఆ లోటును ఇప్పుడు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దీప భర్తీ చేశారు. భారతీయ జిమ్నాస్ట్‌లలో ఇప్పటి వరకు 11 మంది పురుషులు మాత్రమే ఒలింపిక్స్‌కి వెళ్లగలిగారు. సంక్షిప్తంగా... పేరు : దీపా కర్మాకర్ ప్రఖ్యాతి : జిమ్నాస్ట్, కామన్వెల్త్ మెడలిస్ట్ ఎత్తు : 4 అ. 11 అం. బరువు : 47 కిలోలు కోచ్ : బిశ్వేశ్వర్ నంది ముద్దు పేరు : గుడ్డూ జన్మదినం : 9 ఆగస్టు 1993 జన్మస్థలం : అగర్తల, త్రిపుర తల్లిదండ్రులు : నాన్న దులాల్, అమ్మ గౌరి చదువు : ఫైనలియర్ డిగ్రీ కాలేజ్ : ఉమెన్స్ కాలేజ్, అగర్తల లక్ష్యం : ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం -
ఒలింపిక్ పతకమే నా లక్ష్యం
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ న్యూఢిల్లీ: క్రీడాకారులెవరైనా కెరీర్‌ను ప్రారంభించే ముందు ఆయా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరాలని... ఒలింపిక్స్‌లో పోటీపడాలని కలలు కంటుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ జిమ్నాస్టిక్స్‌లో భారత్ నుంచి ఇప్పటిదాకా అసాధ్యమనుకున్న ఫీట్‌ను సాధ్యం చేసిన దీపా కర్మాకర్ మాత్రం ఈ కేటగిరీలోకి రాదు. తాను చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టాలని భావిం చింది. అనుకున్నది సాధించడమే కాకుండా దేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గానూ నిలిచింది. ఈ నేపథ్యంలో రియో డి జనీరోలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న దీపకు ఘనస్వాగతం లభించింది. ‘ఏదో ఓ రోజు నేను ఒలింపిక్స్‌లో పోటీ పడి దేశానికి గౌరవం తీసుకురావాలని కలలు కన్నాను. నిజానికి కెరీర్ ఆరంభం నుంచే ఈ కోరిక నాలో పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నిజంగానే నేను ఒలింపిక్స్‌కు అర్హత సాధించాను. ఇక ఇప్పుడు గతంకన్నా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంది. రియో గేమ్స్‌లో పతకం సాధిస్తాననే భావిస్తున్నాను. దీనికోసం శాయశక్తులా ప్రయత్నించి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నాను. ఇప్పుడిదే నా లక్ష్యం’ అని 22 ఏళ్ల దీప తెలి పింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నా, ఐదో స్థానం లో నిలిచానని చెప్పింది. అయితే ఇటీవల క్వాలిఫయింగ్ టోర్నీలో ఆమె 52.698 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా వచ్చిన తాజా గుర్తింపుతో తానేమీ స్టార్ అథ్లెట్‌గా భావించడం లేదని, తన గురి అంతా పతకంపైనే ఉందని స్పష్టం చేసింది. -
దీపకు ప్రధాని ప్రశంస
కట్రా (జమ్మూ): మహిళల జిమ్నాస్టిక్ విభాగంలో భారత్ నుంచి తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపా కర్మాకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘దీప భారత్ గర్వపడేలా చేసింది. ఒలింపిక్స్‌లో తొలిసారి భారత పుత్రిక జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనబోతోంది. అకుంఠిత దీక్షతోనే తాను అనుకున్నది సాధించగలిగింది. సౌకర్యాల లేమి ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయింది. జీవితంలో పైకి ఎదగాలంటే ఎవరైనా ఇలాంటి కృషి చేయాల్సిందే. ఎలాంటి సాకులు చూపకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి’ అని ప్రధాని సూచించారు. మరోవైపు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని దీప తెలిపింది.