ఫోర్బ్స్ ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో దీప, సాక్షి
న్యూయార్క్: రియో ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో యావత్ భారతావని మనసులను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌లకు అంతర్జాతీయస్థాయి గౌరవం లభించింది. ప్రముఖ మేగజైన్ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు తమ తమ రంగాల్లో రాణించి గొప్ప విప్లవాత్మక మార్పులకు కారణమైన 300 మంది యంగ్ అచీవర్స్‌తో ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను రూపొందించింది. భారత్ నుంచి మొత్తం 53 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు.
‘రియోలో దీపా పతకం గెలవకపోయినా... కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన ప్రోడునోవా విన్యాసాన్ని విజయవంతంగా చేసింది’ అని ఫోర్బ్స్ పత్రిక ప్రశంసించింది. మరోవైపు ఎన్నో ప్రతికూలతలను అధిగమించి సాక్షి మలిక్ మహిళల రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఫోర్బ్స్ పత్రిక కొనియాడింది. దీపా, సాక్షిలతోపాటు ఈ జాబితాలో భారత తొలి పారాలింపిక్ స్విమ్మర్ శరత్ గైక్వాడ్‌కూ స్థానం లభించింది. కేవలం ఒక చేయి సహకారంతో స్విమ్మింగ్ చేసే శరత్ ఇప్పటివరకు పలు ఈవెంట్లలో 96 పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.