సాక్షి, దీప మరో ఘనత
న్యూఢిల్లీ: ఫోర్బ్ష్ సూపర్ ఎచీవర్స్ జాబితా-2017లో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, నటి అలియా భట్ చోటు దక్కించుకున్నారు. ఆసియా ఖండంలో 30 ఏళ్లలోపు విజేతలతో ఈ జాబితా తయారు చేసింది. 10 విభాగాలకు చెందిన 300 మంది యువ విజేతల పేర్లను ఇందులో పొందుపరిచింది. వినోదం, వాణిజ్యం, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సామాజిక వాణిజ్యం, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ తదితర రంగాల్లో విజేతలుగా నిలిచిన 30 ఏళ్లలోపు వారిని ఈ జాబితాలో చేర్చింది.
భారత్ నుంచి 53 మంది విజేతలకు చోటు దక్కింది. చైనా(76) మనకంటే ముందుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సోదరులు సంజయ్(15), శ్రావణ్ కుమరన్(17) పిన్నయవస్కులుగా నిలిచారు. ఐదేళ్ల క్రితం వీరిద్దరూ గో డైమన్షన్స్ పేరుతో మొబైల్ యాప్ అభివృద్ధి సంస్థను స్థాపించారు.
0.15 పాయింట్లతో పతకం కోల్పోయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని దీపా కర్మాకర్ ను ఫోర్బ్స్ ప్రశంసించింది. రియో ఒలింపిక్స్ లో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ లోని రొహతక్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన సాక్షి మాలిక్ స్థానిక అవాంతరాలను అధిగమించి రెజ్లింగ్ లో ఒలింపిక్ పతకం సాధించిందని ఫోర్బ్స్ మెచ్చుకుంది.