న్యూఢిల్లీ: ప్రముఖ పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా టాప్–7 పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి ఖరీదు చేసే ఇళ్ల విక్రయాలు గతేడాది (2023లో) 75 శాతం అధికంగా నమోదయ్యాయి. సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐలు) లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో గతేడాది విలాస గృహాల అమ్మకాలు 2,030 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2022)లో ఇవి 1,240 యూనిట్లు కావడం గమనార్హం.
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి విలువైన ఇళ్ల అమ్మకాలు 2023లో 12,935 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో 7,395 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘‘ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లకు ఉన్న ఆకర్షణ కొనసాగుతుంది. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతుంది. ప్రాంతీయంగా కొంత అస్థిరతలు ఉండొచ్చు. మొత్తం మీద భవిష్యత్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు.
పట్టణాల వారీగా..
► ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2023లో 5,530 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో అమ్మకాలు 1,860 యూనిట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి.
► ముంబైలో 4,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదిలో అమ్మకాలు 3,390 యూనిట్లుగా ఉన్నాయి.
► పుణెలో 450 యూనిట్ల విక్రయాలు గతేడాది నమోయ్యాయి. అంతకుముందు ఏడాది ఇవి 190 యూనిట్లుగా ఉన్నాయి.
► బెంగళూరులో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 265 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
► కోల్‌కతాలో 2022లో 300 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా, గతేడాది ఇవి 310 యూనిట్లకు పెరిగాయి.
► చెన్నైలోనూ విక్రయాలు 150 యూనిట్ల నుంచి 160 యూనిట్లకు పెరిగాయి.
► 2023లో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల కేటగిరీల్లో ఇళ్ల అమ్మకాలు 3,22,000 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం.
► మెరుగైన డిమాండ్ నేపథ్యంలో డెవలపర్లు 3,13,000 యూనిట్ల కొత్త ఇళ్ల యూనిట్లను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ.
ఆర్థిక స్థితిలో మార్పు.
‘‘బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతోంది. మెరుగైన ఉపాధి అవకాశాలు ఏ్పడుతున్నాయి. దీంతో మరింత మందికి మెరుగైన జీవనశైలి చేరువ అవుతోంది. పేరొందిన సొసైటీల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’’అని గురుగ్రామ్‌కు చెందిన రియల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. ఈ ధోరణి ఇక ముందూ కొనసాగడమే కాకుండా, భారత్ వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment