దేశంలో ఎస్‌యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్‌యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్‌యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్‌యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్‌యూవీ మార్కెట్‌లో మహీంద్రా ఎస్‌యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్‌లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్‌సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment