ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 351 పాయింట్లు జంప్‌చేసి 48,445కు చేరింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు ఎగసి 14,248 వద్ద ట్రేడవుతోంది. 10 రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు దిగడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,503 ఎగువన, నిఫ్టీ 14,259 వద్ద గరిష్టాలను చేరాయి. ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు అప్పుడప్పడూ లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. దీంతో గత రెండు రోజుల్లో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య వెనకడుగు వేసినట్లు తెలియజేశారు. అయితే కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్)
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా, ఐటీ, ఫార్మా, ఆటో 1.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, ఐషర్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, విప్రొ 4-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, టైటన్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
పవర్ షేర్లు ప్లస్
డెరివేటివ్ స్టాక్స్‌లో టొరంట్ పవర్, కంకార్, టాటా పవర్, ఐడియా, నాల్కో, ఐబీ హౌసింగ్, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్ 4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, కమిన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఇండిగో, గోద్రెజ్ ప్రాపర్టీస్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,706 షేర్లు లాభపడగా.. 521 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 382 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 990 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 484 కోట్లు, డీఐఐలు రూ. 380 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment