ముంబై: ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటుతో బ్యాంక్‌లు తిరిగి డిపాజిట్లను ఆకర్షించగలవని ఎస్‌బీఐ ఎండీ అశ్విని తివారీ అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐ డిపాజిట్ల వృద్ధికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలను కీలకంగా చూస్తున్నట్టు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లలో ర్యాలీతో బ్యాంకుల్లోని డిపాజిట్లు అధిక రాబడులను ఇచ్చే ఇతర సాధనాల్లోకి మళ్లేలా చేసినట్టు పేర్కొన్నారు.
కాలక్రమేణా మార్కెట్ కరెక్షన్‌కు లోనైతే గతంలో తమ వద్ద డిపాజిట్లుగా ఉండే కొంత మొత్తం తిరిగి వెనక్కి వస్తుందన్నారు. తక్కువ విలువైన, చిన్న ఖాతాల ద్వారా డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తివారీ తెలిపారు. జన్‌ధన్ యోజన ఖాతాలపై గతంలో ప్రత్యేక దృష్టి ఉండేది కాదంటూ, ఇక మీదట ఆ ఖాతాలను కూడా కీలకంగా చూస్తామన్నారు. గడిచిన 18 నెలలుగా బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే రుణాల వృద్ధే అధికంగా నమోదవుతుండడం గమనార్హం. దీంతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రేట్లను పెంచడం లేదంటే రుణ వృద్ధిలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.
దేశ ఈక్విటీ మార్కెట్ గడిచిన ఏడాదిన్నర పాటు గణనీయమైన వృద్ధిని చూడడం గమనార్హం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచవుల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న ధోరణి నెలకొంది. ఈ క్రమంలో అశ్విని తివారీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్‌సెక్యూర్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచడం, ప్రాజెక్టు రుణాలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం వంటివి డిపాజిట్లలో వృద్ధి నిదానించడానికి సంకేతంగా తివారీ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే డిపాజిట్ల రేట్లను సైతం పెంచుతామని ప్రకటించారు.
ప్రత్యామ్నాయాలు..
సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో 90 శాతం మేర రుణ అవసరాలకు సరిపడా నిధులు డిపాజిట్ల రూపంలోనే వస్తుంటాయని.. ఇన్‌ఫ్రా బాండ్లు వంటి ఇతర సాధనాలవైపు చూడక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ల వాటా తగ్గొచ్చని తివారీ చెప్పారు. సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియో చెల్లింపుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment