
వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరికి అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,663 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలపడి 11,102 వద్ద స్థిరపడింది. అయితే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 38,140 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నుంచీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఆటుపోట్లను చవిచూసింది. 37,551 పాయింట్ల దిగువన కనిష్టాన్ని తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,226- 11,064 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
మీడియా సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 4.25 శాతం జంప్‌చేయగా, ఆటో 2.2 శాతం ఎగసింది. మీడియా 1 శాతం లాభపడగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్, ఎంఅండ్‌ఎం, మారుతీ, శ్రీ సిమెంట్, ఎయిర్‌టెల్ 9-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్‌లో యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఆర్‌ఐఎల్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్, ఐటీసీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
సెయిల్ జూమ్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో సెయిల్, నౌకరీ, నాల్కో, బాటా, ఆర్‌బీఎల్, పీవీఆర్, హావెల్స్, టీవీఎస్, ఐబీ హౌసింగ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఐడియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ సీపీ, పిడిలైట్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్, కేడిలా హెల్త్, పిరమల్, ఎస్‌బీఐ లైఫ్ 3.5-1.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1621 లాభపడగా.. 1012 మాత్రమే డీలాపడ్డాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 7818 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. వీటిలో బంధన్ బ్యాంకులో వాటా కొనుగోలు పెట్టుబడులు కలసి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. డీఐఐలు దాదాపు రూ. 136 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.
Comments
Please login to add a commentAdd a comment