వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు ఎగసి 38,407 వద్ద నిలవగా.. 52 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,322 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా మార్కెట్లు హుషారుగా కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ మిడ్‌సెషన్‌లో కాస్త మందగించి 38,313కు వెనకడుగు వేసినప్పటికీ ఒక దశలో 38,556 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,374- 11,299 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది.
ఎఫ్‌ఎంసీజీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, మెటల్స్, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం బలపడింది. అయితే ఫార్మా, రియల్టీ, ఐటీ 1.4-0.6 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, బీపీసీఎల్, ఇండస్‌ఇండ్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ 5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీ సిమెంట్, టైటన్, యూపీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, బ్రిటానియా, ఎయిర్‌టెల్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి.
ఐడీఎఫ్‌సీ జోరు
డెరివేటివ్స్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ 7.4 శాతం జంప్‌చేయగా.. ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, వోల్టాస్, రామ్‌కో సిమెంట్, మదర్‌సన్, సీమెన్స్, నాల్కో 5.3- 2.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క టొరంట్ ఫార్మా, ఐడియా, నౌకరీ, బీవోబీ, బాష్, కేడిలా హెల్త్, ఈక్విటాస్, భారత్ ఫోర్జ్, సెంచురీ టెక్స్, అపోలో టైర్ 4.6-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,600 షేర్లు లాభపడగా.. 1160 నష్టాలతో ముగిశాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment