ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 45,875కు చేరింది. నిఫ్టీ సైతం 102 పాయంట్లు కోల్పోయి 13,456 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ఐటీ సేవల మధ‍్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్
మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. నేడు సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దీంతో కేఎన్‌ఆర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 7.4 శాతం దూసుకెళ్లి రూ. 318ను తాకింది. ప్రస్తుతం 6.3 శాతం ఎగసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ షేరు 23 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
మజెస్కో లిమిటెడ్
వాటాదారులకు షేరుకి రూ. 974 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు అనుమతించినట్లు బీమా రంగ ఐటీ సేవల కంపెనీ మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. వెరసి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపైనా 19,480 శాతం డివిడెండ్‌ను చెల్లించనుంది. ఇందుకు రూ. 2,788 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మజెస్కో షేరు తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,010కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 992 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment