ముందురోజు నమొదైన భారీ అమ్మకాల నుంచి కోలుకుంటూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 97 పాయింట్లు తక్కువగా 40,048కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 11,747 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,291- 39,978 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటం, సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
బ్యాంక్స్, రియల్టీ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్ 1.4- 0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఎస్‌బీఐ, గెయిల్, టాటా మోటార్స్, యాక్సిస్, ఇన్ఫోసిస్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే కొటక్ బ్యాంక్ 6 శాతం జంప్‌చేయగా.. ఎన్‌టీపీసీ, శ్రీసిమెంట్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి.
డెరివేటివ్స్ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఆర్‌బీఎల్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, టొరంట్ పార్మా, బంధన్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఐడియా, బీవోబీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎల్‌ఐసీ హౌసింగ్, పీఎన్‌బీ, అపోలో టైర్, పీవీఆర్ 3.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. ఏసీసీ, జీ, ఇన్‌ఫ్రాటెల్, కాల్గేట్, ఎంఆర్‌ఎఫ్, కోఫోర్జ్, పిడిలైట్ 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,072 నష్టపోగా.. 639 లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment