దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.
కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment