ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌కు ఆమోదం పొందిన కంపెనీగా మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి ఆటోమోటివ్ కంపెనీగా బెంజ్ అవతరించింది. లెవెల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సాంకేతికత ప్రమాణాలను సెట్ చేసే ఐక్యరాజ్యసమితి నియంత్రణ సంస్థ UN-R157 ఆమోదం తెలిపింది.
2022 ప్రథమార్థంలో మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, ఈక్యూఎస్ మోడల్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను ‘డ్రైవ్ పైలట్’గా పేరుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థతో వాహనదారులు ఆటోమేటెడ్ మోడ్‌లో 60 kmph వేగంతో డ్రైవ్ చేయగలరు. సురక్షితమైన ఆటోనామస్ డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకుగాను అదనపు సెన్సార్‌లను డ్రైవ్ పైలట్‌లో మెర్సిడెస్ బెంజ్ అమర్చింది. వీటిలో లైడర్, వెనుక విండోలో కెమెరా, అత్యవసర వాహనాల నుంచి బ్లూ లైట్లు, ఇతర ప్రత్యేక సిగ్నల్‌లను గుర్తించడానికి రూపొందించబడిన మైక్రోఫోన్స్‌ను ఏర్పాటుచేశారు. అసాధారణమైన పరిస్థితులో ట్రాఫిక్‌ను గుర్తించడానికి డిజిటల్ హెచ్‌డీ మ్యాప్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
జర్మనీలో డ్రైవ్ పైలట్ రెడీ..!
ఇప్పటికే జర్మనీలో 13,191 కి.మీ హైవేలపై డ్రైవ్ పైలట్‌ను అందిస్తున్నట్లు బెంజ్ పేర్కొంది. యూఎస్‌ఏ , చైనా వంటి దేశాలలో డ్రైవ్ పైలట్ సిస్టమ్ విస్తృతమైన టెస్ట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోన్నట్లు వెల్లడిచింది.
లెవల్-3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ అంటే..!
పలు దిగ్గజ కంపెనీలు ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌ను రూపొందిస్తున్నాయి. కాగా ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌లో టెస్లా ముందుంది. టెస్లా కేవలం లెవల్-2 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. లెవల్ 2 ఆటోనామస్ కార్లను నడుపుతున్న వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ వీల్‌పై చేతులను ఉంచుతూ ఉండాలి. ఒక వేళ అలా చేయకపోతే ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ వాహనదారుడిని హెచ్చరిస్తుంది. కాగా ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్ డెవలప్ చేసిన లెవల్-3 డ్రైవ్ పైలట్‌తో వాహనదారుడు డ్రైవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు.
చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ
Comments
Please login to add a commentAdd a comment