న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించే ప్రణాళికతో ఉన్నాయి. ఈ విషయాన్ని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. మెటావర్స్ అనేది సంస్థ ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాలను కస్టమర్ ఉన్న చోట నుంచే వర్చువల్‌గా చూపించే టెక్నాలజీ. మెటావర్స్‌తో సంప్రదింపులు చేస్తున్న కంపెనీల్లో అధిక శాతం ఏడాదిలోనే తమ కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పాయి.
మెటావర్స్ పట్ల తమకు సరైన అవగాహన ఉన్నట్టు 60 శాతం వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు (ఉన్నతోద్యో గులు) చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 కంపెనీల ప్రతినిధులను పీడబ్ల్యూసీ సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది.
‘‘మెటావర్స్‌తో అవకాశాలు అపారం. మెటావర్స్‌తో విశేషమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. వివిధ ప్రాంతాలు, తరాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు నూతన టెక్నాలజీ పట్ల అనుకూలంగా ఉన్నారు. దీంతో కంపెనీలు మెటావర్స్ సాంకేతికత అమలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్‌నర్ అశుతోష్ చాంద్ తెలిపారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు మెటావర్స్ విషయంలో కంపెనీలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాల కోసం సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది.
ఆరంభ దశలో..
మెటావర్స్ సాంకేతికత భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉన్నట్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 25 శాతం మంది తాము ఏడాదిలోపే మెటావర్స్‌తో తమ కార్యకలాపాలను అనుసంధానిస్తామని చెప్పగా, 47 శాతం కంపెనీల ప్రతినిధులు 2–3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. కస్టమర్లతో అర్థవంతంగా సంప్రదింపులు చేసేందుకు వీలుగా కంపెనీలకు మెటావర్స్ వినూత్న అవకాశం కల్పిస్తుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ సుదీప్త ఘోష్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది సైబర్ సెక్యూరిటీ వ్యాపారాలకు పెద్ద రిస్క్ అని చెప్పగా, 28 శాతం కంపెనీల ప్రతినిధులు టెక్నాలజీ పరిమితులను సవాలుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment